(రాజకీయాల్లో కులాల కెమిస్ట్రీ-5)
ముద్రగడ పద్మనాభం, పద్మావతి దంపతుల నిరాహారదీక్ష ప్రయోజనం నెరవేరింది. కాపులరిజర్వేషన్ పై తెలుగుదేశం ఇచ్చిన హామీని నెరవేర్చవలసిన అవసరాన్ని ప్రజల్లోకి ప్రభుత్వంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళడంలో ముద్రగడ విజయం సాధించారు. ఆ విధంగా, నిమ్మరసంతో ఆయన ఉద్యమ, దీక్షల ప్రయోజనం నెరవేరింది.
ముద్రగడ ఉద్యమించకపోతే కాపు రిజర్వేషన్ అంశాన్ని చంద్రబాబు పక్కనపెట్టెయ్యడమో, సాగదీస్తూనే వుండేవారని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కూడా ఆయన సఫలమయ్యారు
కాపు సమాజంలో ఉద్రిక్తతలు, ఇతరకులాల్లో ఆందోళన పెరుగుతున్న నేపధ్యం…ముద్రగడ దంపతుల ఆరోగ్యస్ధితుల రీత్యా దీక్షవిరమింపజేసే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మొదటిదశగా ముద్రగడతో సంప్రదింపులు ప్రారంభించారు. రెండు విడతలుగా చర్చలు జరిగాయి. ఆయన మనసులోమాట తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రతిపాదనలను వివరించి దీక్ష విరమింపజేసే బాధ్యతను తెలుగుదేశం అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, మంత్రి కింజరపు అచ్చెన్నాయుడులకు ముఖ్యమంత్రి అప్పగించారు. ఆవిధంగా దీక్ష ముగిసింది.
అనేక సంక్లిష్టతలు, సుదీర్ఘమైన ప్రొసీజరు ఇమిడివున్న కాపుల రిజర్వేషన్ ఇప్పటికిప్పుడే తెమిలే వ్యవహారం కాదు. రిజర్వేషన్లను గతంలో మాదిరిగా కోర్టులో సవాలు చేసే అవకాశం ఇవ్వకుండా కమీషన్ ఏర్పాటు చేసి ఆనివేదికను కేంద్రానికి ఇచ్చి తొమ్మిదో ఆర్టికల్ లో చేర్పించడం…కమీషన్ నివేదికను ప్రాతిపదికగా చేసుకుని ప్రభుత్వమే జిఓ జారీ చేయటం రాష్ట్ర ప్రభుత్వం ముందున్న మార్గాలు. ఏ మార్గాన్ని ఎంచుకున్నా కమీషన్ నివేదిక కావాలి. అందుకే మంజునాధ్ కమీషన్ నివేదిక ఇవ్వడానికి త్వరితంగా గడువు తేదీని నిర్ణయించాలని ముద్రగడ దీక్ష విరమణకు ప్రధాన షరతు విధించారు. కమీషన్ న్ లో ముద్రగడ సూచించిన ఒకరిని సభ్యునిగా నియమించాలన్నది ఇక్కడ కీలకమైన అంశం.
కాపు గర్జన సభ మొదలు ఇంతవరకూ అన్ని పరిణామాల్లోనూ ప్రభుత్వమూ, ప్రతి పక్షాలు పరస్పరం శత్రుపూరితంగానే వ్యవహరిస్తున్నాయి. సమస్యను సామాజిక కోణం నుంచికాక రాజకీయంగా చూడటమే ఇందుకు మూలం. ”శాసనసభలో, మండలిలో మీకే మెజారిటీ వుంది కాపుల రిజర్వేషన్ ను చట్టం చేయండి. కేంద్రంలో వున్నది మీ మిత్ర పక్షమే కాబట్టి ఆర్టికల్ 9 లో చేర్పించండి.” అని అన్ని రాజకీయపార్టీలూ సలహాలు ఇచ్చేస్తున్నాయి.
ఇది అసాధ్యమని వారికీ తెలుసు…గుజరాత్ లో పటేళ్ళు, మరోచోట గుజ్జర్లు రిజర్వేషన్లు కోరుతున్న నేపధ్యంలో కాపుల రిజర్వేషన్ ను 9 వఆర్టికల్ లో చేర్చడం కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వానికి సాధ్యం కాదని వారికి తెలుసు. ఈ పద్ధతిలోనే కులాలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం భగ్గుమని మండిపోతుందన్న (మండల్ కమీషన్ సిఫార్సుల అమలు) చరిత్రా, స్పృహా మరచిపోయి ఇలాంటి సలహాలు ఇవ్వడం బాధ్యతారాహిత్యమని తెలుసుకోలేకపోవడం ఆయా పార్టీల దివాళాకోరు ఆలోచనలకు సాక్ష్యం.
ఇందులో రాష్ట్రప్రభుత్వం బాధ్యతే ఎక్కువ. కీలకమైన విషయాల్లో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించే అలవాటు చంద్రబాబు నాయుడికి లేకపోవడమే పెద్దలోపం. ఇతరులకు క్రెడిట్ దక్కకూడదన్న దృష్టే ఇందుకు మూలం. ఈ సంకుచిత్వం ప్రజాస్వామిక ప్రక్రియకు పెద్ద విఘాతం!
సామాజిక సామరస్యం పటిష్టంగా వుండాలంటే రిజర్వేషన్ కోరుతున్న కాపులు, వ్యతిరేకిస్తున్న బిసిల మధ్య ప్రశాంత వాతావరణంలో చర్చలు జరగాలి. పెద్దకులస్తులైన కాపులు బిసి జాబితాలో చివరగా వుండటానికి పెద్దమనసుతో అంగీకరించాలి. అదేసమయంలో బిసిలలో చివర వున్న బుడబుక్కల కులం వంటి కులం తో తామూ సమానమన్న దిగివచ్చే భావనను కాపులు మానసికంగా ఆమోదించాలి.
కొందరు బిసి నాయకుల మాటల ప్రకారం కాపులను బీసీ జాబితాలో చేర్చే పక్షంలో ముస్లింలను ‘‘ఇ’’ కేటగిరీగా ప్రకటించినట్టుగానే కాపులను కూడా ‘‘ఎఫ్’’ కేటగిరీగా ప్రకటించాలి. విద్య, ఉద్యోగాలు, ఉపాధి అంశాలలో వున్న కేటగిరీలను స్థానిక సంస్థలు, చట్టసభల పదవుల కేటాయింపులో కూడా అమలు చేయాలి. బీసీలలో ఇప్పటి వరకు చట్టసభలలో ప్రవేశించని బీసీ కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గుర్తించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా కులాల వారీగా జనాభా వివరాలు సేకరించాలి. మొత్తం జనాభాలో ఆయా కులాల శాతాన్ని బట్టి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎన్నికల్లో పోటీపడలేని బీసీ కులాలకు జనాభా శాతాన్ని బట్టి ఎమ్మెల్సీగా ఎంపికచేసి వారికి అవకాశం కల్పించాలి. అన్ని బీసీ కులాల వారికి ఒకేసారి సీట్లు కేటాయించడం సాధ్యం కాదని భావించినప్పుడు ఒక పర్యాయం ఒక కులం వారికి, మరో పర్యాయం మరో కులం వారికి ప్రాధాన్య క్రమంలో అవకాశం కల్పించాలి.
ఇదంతా కేవలం రాజకీయ ప్రక్రియద్వారానే పూర్తికాదు..సామాజిక సంస్ధలు,ప్రముఖుల చొరవా చర్చల వల్ల మాత్రమే పూర్తవుతుంది. ఇదంతా ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఇది సజావుగానే ముగిసినా అగ్రవర్ణాలలోని పేదల పరిస్ధితి ఏమిటని ఉద్యమం మొదలైతే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది.