అమెరికాలో అగ్రగామి తెలుగు సంస్థ తానా (TANA) అంతర్గత కలహాల కారణంగా తీవ్ర సంక్షోభ దిశగా ప్రయాణిస్తోంది. భారత రాజకీయాల్లో కనిపించే ,వ్యవస్థని చెద పట్టించే దుస్సంప్రదాయాలు గతంలోనే పలుమార్లు ఈ సంస్థ లో వెలుగు చూసినా, ఇప్పుడు మరింత పాతాళానికి చేరుతున్న సూచనలు స్పష్తంగా కనిపించే వరుస సంఘటన లు జరగడం బాధాకరం .
18,000 మంది సభ్యులు కలిగి తెలుగు సంస్థల్లో ఎక్కువ సభ్యులు ఉన్న తానాలో ఈ సంవత్సరం కొత్తగా సుమారు మరో 17,000 మంది సభ్యత్వం కోసం ధరఖాస్తులు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వర్గం ఈ సారి భారీగా డబ్బు ఖర్చుతో నూతన సభ్యులని చేర్చడానికి శ్రమించింది. తానా రాజ్యాంగం ప్రకారం , జనవరి 31- 2022 లోపు సభ్యత్వానికి అప్లై చేసిన వారికి మాత్రమే తదుపరి ఎన్నికలలో ఓటు హక్కు లభిస్తుంది. సభ్యత్వ ధృవీకరణ కమిటీ నిర్ణీత సమయంలో ,ఏప్రిల్ 30 2022 లోపు, ఈ ఆమోద ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది. చాలా పెద్ద సంఖ్యలో ధరఖాస్తులు రావటం వలన నిర్ణీత సమయం లో ఆమోదం పొందకపోవటం వలన కొత్త సభ్యులు ఓటు హక్కు కోల్పోయారు అని పైకి చెప్తున్నప్పటికీ అసలు జరిగిన కథ వేరేగా ఉంది. నూతన సభ్యత్వాల్లో తమ వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది లేకపోవడంతో రాబొయే ఎన్నికలలొ సంస్థ పై పట్టు కోల్పోతాము అని గ్రహించిన తాజా మాజీ అధ్యక్షుని వర్గం కుట్ర చేసి సకాలంలో సభ్యత్వ ధ్రువీకరణ చేయకుండా అడ్డుపడింది అని విశ్వసనీయంగా తెలియవచ్చింది.
ఈ విషయాన్ని మొదటగా క్రితం ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన శ్రీనివాస్ గోగినేని సభ్యులకి ఉత్తరం ద్వారా లేవనెత్తారు.అనంతరం జరిగిన ఈసీ సమావేశంలో సభ్యులని ఆమోదిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుని ఓటు హక్కు కల్పించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా బోర్డుని కోరింది. బోర్డు సమావేశంలో బైలాస్ సవరణ పై ఓటింగ్ జరుగగా 15 సభ్యుల బోర్డులో ఇద్దరు సీనియర్ సభ్యులు తటస్థంగా వుండటంతో 7-6 తో తీర్మానం వీగిపోయింది. ఏది సరైన నిర్ణయమో దానికి అనుగుణంగా వోటు వెయ్యకుండా ,కీలక నిర్ణయంలో ఈ సీనియర్స్ ఇద్దరు వోటు వెయ్యకపోవడం శోచనీయం . ఈ చర్య వలన సుమారు 17,000 కుటుంబాలకి రాబొయే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం వున్నా ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతున్నారు.
బోర్డు సమావేశంలో పూర్వ అధ్యక్షునికి చెందిన వర్గం ఓటు హక్కు కల్పించటానికి వ్యతిరేకంగా ఓట్లు వేయటం వలన దీనికీ రాజకీయ కోణం వుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మొత్తం తప్పిదంకు ప్రధాన కారణంగా భావిస్తున్న Membership Verification Committee ( MVC) In charge అయిన నిరంజన్ శృంగవరపు ఇది తన తప్పిదంగా ఈసీ సమావేశంలో ఒప్పుకున్నారు. అయితే ఈయన వెంటనే జరిగిన బోర్డు సమావేశంలో “నూతన సభ్యులకి ఓటు హక్కు ఇవ్వొద్దు ” అని ఓటు వేయటం తానా శ్రేయోభిలాషులకు ఆశ్చర్యం కలుగచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన తప్పిదం వలన జరిగిన పొరపాటుని సరిదిద్దే చర్యల్లో ఆయనకీ ఓటు హక్కు కల్పించటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
తాజా ఎన్నికలలో గెలిచిన నాటి నుండే ఏ కారణం పైన అయితే వ్యతిరేకంగా పోరాడారో అదే గుత్తాధిపత్యం కోసం ఒక వర్గం వెంపర్లాడటం ప్రారంభించింది. నిత్య అసమ్మతివాదులు గా ఆ వర్గానికి చెందిన నేతలు తానా ప్రస్తుత అధ్యక్షుడు అంజయ్యచౌదరి ని ముప్ప తిప్పలు పెడుతున్నారు. ఈ వోటింగ్ చర్య వలన మరింత వ్యతిరేకత మూటగట్టుకోనున్నారు.
సున్నితమైన విషయాలపై నిర్ణయం తెలిపేందుకు కొన్ని సందర్భాలలో చాలా సంవత్సరాలు తీసుకునే బోర్డు 17,000 మంది కుటుంబాల ఓటు హక్కు కాలరాయడానికి ఒకే ఒక్క సమావేశం లో నిర్ణయం తీసుకోవటం వారి నిర్లక్ష్య వైఖరి ని తెలియచేస్తుంది. , తానా ని పరిరక్షించాల్సిన వృద్ధ ద్వయం ఇంత ముఖ్యమయిన అంశం పై తటస్థంగా వుండటాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు.భాద్యతాయుత పదవి లో ఉంది తానా సంస్థ కి మార్గనిర్దేశం చేయకుండా మౌనం దాల్చటం ఎంత వరకూ సముచితమో వాళ్లకే తెలియాలి. ఈ విషయం తెలిసి ఇప్పటికే పలువురు ఓటు దరఖాస్తుదారులు తానా లీడర్షిప్ కి ఇమెయిల్ ద్వారా తమ గోడు ని వెళ్లబోసుకుంటున్నారు. తానా పూర్వ బోర్డు చైర్మన్ నరేన్ కొడాలి మరియు తానా పూర్వ ఫౌండేషన్ ట్రస్టీ రవి మందలపు ఈ చర్య ను సరిదిద్దుకోవాల్సింది గా బోర్డుని అభ్యర్దించారు. సభ్యులకి ఓటు హక్కు కల్పించే అంశం లో ఉద్యమం చెయ్యటానికి వెనుకాడబోమని తెలిపారు.