ఐదు నెలల క్రితం జరిగిన తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధికి వైకాపా మద్దతు ప్రకటిస్తే, అందరూ అప్పుడు తప్పు పట్టారు. ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించగానే మళ్ళీ అందరూ తప్పు పడుతున్నారు. నిజానికి వైకాపా ఒక స్వతంత్ర రాజకీయ పార్టీ. అది తనకు నచ్చినవారికి మద్దతు ఈయవచ్చును. కోరుకొంటే ఏ ఎన్నికలలోనయినా పోటీ చేయవచ్చును. అయినప్పటికీ దాని కాంగ్రెస్, తెదేపా నేతలు దాని నిర్ణయాలను తప్పు పడుతున్నారు. నిజానికి వారికి ఆ అవకాశం కల్పించింది వైకాపాయేనని చెప్పక తప్పదు.
ఆంధ్రా, తెలంగాణాలలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుతెన్నులు గమనిస్తే అందుకు కారణం అర్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏమూల ఏ చిన్న సమస్య గుర్తించినా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటారు. కానీ అదే తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం, పంట రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు వంటి అనేక ముఖ్యమయిన సమస్యలపై తెలంగాణా వైకాపా నేతలు అసలు పెదవి విప్పరు. వైకాపా, తెరాసల మధ్య ఉన్న రహస్య అవగాహన కారణంగానే మౌనం వహించాల్సి వస్తోందనేది బహిరంగ రహస్యమే.
ఆ రెండు పార్టీలు కూడా తెదేపా-బీజేపీలు మాదిరిగా బహిరంగంగా తాము మిత్రులమని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాయి అనే ప్రశ్నకు సులభంగానే జవాబు దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తెరాసతో వైకాపా బహిరంగంగా చేతులు కలిపినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంది. అందుకే తెరాసతో తన అనుబంధాన్ని వైకాపా రహస్యంగా దాచుకోవలసి వస్తోంది. కానీ అవసరంపడినప్పుడు ఏదో విధంగా తెరాసకు అండగా నిలబడుతూనే ఉంది. ఓటుకి నోటు కేసులో తెరాసకు వత్తాసు పలుకుతూ తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపా ఏవిధంగా పోరాడిందో అందరికీ తెలుసు. నిజానికి ఆ వ్యవహారంలో తెరాస కంటే వైకాపాయే చాలా తీవ్రంగా పోరాడిందని చెప్పవచ్చును. ఆ వ్యవహారంలో తెదేపా నిజంగానే తప్పు చేసి ఉండవచ్చును. కానీ ఆ సమయంలో వైకాపా-తెరాసలు వ్యవహరించిన తీరుతో వాటి మధ్య ఎంత బలమయిన అనుబందం ఉందో విస్పష్టంగా బయటపెట్టుకొన్నాయి. తమ ఉమ్మడి శత్రువయిన చంద్రబాబు నాయుడుని నిలువరించేందుకే ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లు ఆనాటి సంఘటనలన్నీ రుజువు చేసాయి.
తెలంగాణాలో చాలా బలంగా ఉన్న అధికార తెరాస, కాంగ్రెస్, తెదేపా-బీజేపీలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడబోతున్నాయి.తెలంగాణాలో అసలు తన ఉనికే చాటుకోలేని వైకాపా వాటితో పోటీ పడినా ఈ ఎన్నికలలో గెలవలేదని చెప్పడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. యధాశక్తిగా ఓట్లు చీల్చి తెరాసకు లాభం చేకూర్చాలనే ఉద్దేశ్యంతోనే బరిలోకి దిగుతోందని ప్రత్యర్ధపార్టీలు ఆరోపిస్తున్నాయి.
అసలు వైకాపాకు తెలంగాణాలో బలమే లేనప్పుడు ఏవిధంగా ఓట్లు చీల్చగలదు? అని వైకాపా నేతలు, అభిమానులు ప్రశ్నించవచ్చును. వైకాపాకి తెలంగాణాలో తన స్వంత బలం లేకపోవచ్చును కానీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పట్ల ఇంకా అభిమానం ఉన్నవారి ఓట్లు ఖచ్చితంగా వైకాపాకే పడవచ్చును. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లుగానే, తెలంగాణాలో పరామర్శ యాత్రలు చేస్తున్న షర్మిల కానీ తెలంగాణా వైకాపా నేతలు గానీ నేటికీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నామస్మరణ చేస్తుండటానికి కారణం అదే.
ఒకవేళ వైకాపా బరిలో లేనట్లయితే వైయస్సార్ అభిమానుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఎన్డీయే అభ్యర్దికో పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే తెరాసకు చాలా నష్టపోతుంది. కానీ వైకాపా బరిలో ఉంటే దానికి పడిన ఓట్లన్నీ ఎలాగు వృధా అయిపోతాయి కనుక దాని వలన తెరాసకు ఎటువంటి నష్టము ఉండదు. అందుకే వైకాపాకు ఏమాత్రం బలం లేకపోయినా పోటీ చేయడానికి సిద్దపడుతోందని కాంగ్రెస్, తెదేపాలు వాదిస్తున్నాయి. అందుకే అవి వైకాపా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి.