యుద్ధంలో గానీ దౌత్యంలో గానీ గెలవాలంటే ఒక వ్యూహం ఉండాలి. ప్రత్యర్థిని ముందే భయపెట్టడానికి లేదా గందరగోళంలో పడేయడానికి కావాల్సిన చాతుర్యం ఉండాలి. ముందుకెళ్తే మన పని ఇంతే సంగతులేమో అని భయపెట్టగలగాలి. మన గురించి అతిగా గాభరా పడే పరిస్థితి కల్పించాలి. పాకిస్తాన్ విషయంలో భారత్ ఇలా ప్రవర్తించడంలో మాత్రం పదే పదే విఫలమవుతోంది.
అటు ఉత్తర కొరియాను చూస్తే ప్రపంచం ఆశ్చర్య పోతోంది. ఆర్థిక వ్యవస్థ పరంగా, అభివృద్ధి పరంగా, టెక్నాలజీ పరంగా, ఎలా చూసినా అమెరికాకు సరితూగని దేశం. అమెరికా అనే కొండను ఢీకొనే గడ్డిపోచ లాంటి దేశం. అయినా అమెరికాను సవాలు చేస్తోంది. తాజాగా తాము అణ్వస్త్రాలను మోసుకుపోయే ఖండాంతర క్షపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. దీంతో అమెరికాపై అణుబాంబులేవేయడం సులభం అని తెలిపింది. అంతటితో ఆగకుండా, ఉత్తర కొరియా సైనిక నియంత మరో అడుగు ముందుకు వేశాడు. తాము తలచుకుంటే అమెరికాను బూడిదగా మారుస్తామన్నాడు. భూ గ్రహం మీద అమెరికన్లు నివసించకుండా చేయగలమని సవాలు విసిరాడు.
ఆ తెగింపును చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. ఒక్క మిత్రదేశమైనా లేకపోయినా ఒంటరిగా అమెరికాతో యుద్ధానికి సై అనే ప్రకటనలు పదే పదే చేయడం ఆశ్చర్యకరం.
భారత్ మాత్రం దీని పూర్తి భిన్నం. పాకిస్తాన్ మనతో నేరుగా యుద్ధం చేస్తే ఓడిపోతుందని తెలుసు. కాబట్టి ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది. అందుకోసం డబ్బు, ఆయుధాలు సమకూరుస్తుంది. ఆ డబ్బును కూడా డ్రగ్స్, ఇతరత్రా అక్రమ దందాల ద్వారా మన దేశం నుంచే రాబడుతోంది. మన దేశంలో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా, అది మీవాళ్లే చేశారని పాకిస్తాన్ కు భారత్ చెప్పడం, వాళ్లు ఖండించడం షరా మామూలే. మన దేశంలో మోస్ట వాంటెడ్ క్రిమినల్స్, టెర్రరిస్టులు పదుల సంఖ్యలో పాకిస్తాన్ లో ఆశ్రయం పొందారు. అమెరికా లాడెన్ ను మట్టుబెట్టినట్టే భారత్ కూడా అదే పని చేయవచ్చు కదా అనే దిశగా చర్యలు మాత్రం లేవు. పైగా మోడీ ప్రభుత్వానికి ఓ దశ దిశ లేనట్టు వ్యవహరిస్తోంది. మోడీ లాహోర్ పర్యటన భారత్ పరువు తీసిందనే విమర్శలున్నాయి. పాకిస్తాన్ బతిమిలాడి కాళ్లబేరానికి వచ్చినా వెళ్లకూడని చోటికి పొలోమని వెళ్లిపోవడం చూసి మోడీ కేబినెట్లోని మంత్రులే షాకయ్యారట.
పఠాన్ కోట్ దాడి విషయంలోనూ పాక్ బృందానికి అనుమతినివ్వడం అంటే మనం లొంగిపోయామనే సంకేతాన్నివ్వడమే. అమెరికాను ఉత్తరకొరియా బెదిరిస్తుంటే మనం పాక్ ను చూసి బెదురుతున్నామేమో అని అనుమానం కలుగుతుంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ సహా పాకిస్తాన్ ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తుంది. అది కోలుకోలేని విధంగా దెబ్బతీసే శక్తి ఉండి కూడా మనం చోద్యం చూస్తున్నాం. అదే ఆశ్చర్యకరం.