ఈ ఫొటోలు ఉన్నవాడు కసబ్ 2 అని అప్పుడే పేరు పొందాడు. నల్లచొక్కా వేసుకుని నూనూగు మీసాలతో కనిపిస్తున్నవాడు సామాన్యుడు కాదు. జమ్ము కాశ్మీర్ లోని ఉధంపూర్‌లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ఇద్దరు జవాన్లను పొట్టన పెట్టుకున్న ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడు. పేరు ఖాసింఖాన్. ఊరు పాకిస్తాన్ లోని ఫైసలాబాద్. పన్నెండు రోజుల క్రితం ఓ టెర్రరిస్ట్ గ్యాంగ్ సరిహద్దులు దాటి వచ్చింది. గుర్దాస్ పూర్ లో దాడి జరిపిన వారితో పాటు వీరూ చొరబడ్డారు. బుధవారం నాడు జవాన్లు ఇద్దరు ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నారు. ఆ ఇద్దరిలో ఇతడు ఒకడు.
ముంబై దాడి సమయంలో కసబ్ ను సజీవంగా పట్టుకున్నా వ్యూహాత్మకంగా పెద్దగా సాధించింది ఏమీలేదు. అది పాక్ చేయించిన దాడే అని ప్రపంచానికి తెలుసు. కసబ్ చిరుమానాతో సహా అనేక ఆధారాలు చూపినా మావాడే కాదని ఆనాడ్ పాక్ దబాయించింది. చివరకు ప్రత్యేక బాంబు ప్రూఫ్ సెల్, కోర్టుకు తీసుకు రావడానికి ప్రత్యేక వాహనం వగైరాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అందరు ఖైదీలతో సమానంగా చూడకుండా నర హంతకుడికి స్పెషల్ హోదా ఇచ్చి ప్రజాధనాన్ని వృథా చేసింది ప్రభుత్వం.
ఇప్పుడు ఖాసింఖాన్ మావాడు కాదు పొమ్మని పాక్ దబాయించే అవకాశాలే ఎక్కువ. కేసు విచారణ జరిగే వరకూ మామూలుగా జైల్లో ఉంచుతారో లేక స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తారో తెలియదు. సజీవంగా దొరికాడు కాబట్టి విచారణ, తీర్పు, అమలు వంటి ఫార్మాలిటీస్ అన్నీ పాటించాల్సిందే. అతడిని విచారించి ఉగ్రవాదుల వివరాలు రాబట్టినా ఏం చేయగలం? పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉన్నారో అతడు చెప్పాడే అనుకుందాం. అమెరికా లాడెన్ హతమార్చినట్టు మనం దాడి చేయగలమా? చేయలేం. కాబట్టి, ఆ సమాచారాన్ని అంతర్జాతీ సమాజం ముందు మరోసారి పెట్టడం మినహా మరేం సాధించగలం అని అప్పుడే మీడియా చర్చల్లో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ ను కట్టడి చేయాలంటే మాటలు కాదు చేతలే కావాలని అనేక సందర్భాల్లో వారు సూచించారు.