ఈవారం రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకటి కోర్ట్ అయితే, రెండోది దిల్ రూబా. కోర్ట్ సినిమాకు నాని నిర్మాత. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల సంచలనం సృష్టించిన ఫోక్సో చట్టం, అందులోని లొసుగుల్ని వాడుకొంటూ, అమాయకుల్ని హింసిస్తున్న వైనం ఈ కథలో చూపించారు. ‘ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దు’ అంటూ నాని కూడా `కోర్ట్`పై విపరీతమైన నమ్మకాన్ని చూపిస్తున్నాడు. హీరోగా ప్రియదర్శిపై కూడా ప్రేక్షకులకు నమ్మకం ఉంది. తప్పకుండా మంచి కథే ఎంచుకొంటాడన్న భరోసా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కోర్ట్ రూమ్ డ్రామాలు కూడా కాసులు కురిపిస్తాయని చాలా సినిమాలు నిరూపించాయి. ఈసారీ అదే ఫలితం దక్కుతుందని నాని భావిస్తున్నాడు. మార్చి 14న సినిమా విడుదల అవుతోంది. అంతకంటే ముందే ప్రీమియర్లు, స్పెషల్ షోలూ ప్రదర్శించాలని నాని నిర్ణయం తీసుకొన్నాడు. 13నే ‘కోర్ట్’ని చూసే వీలుంది.
ఇక ‘క’ తరవాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమా ‘దిల్ రూబా’. దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమ కథని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా డైలాగులు యూత్ కి నచ్చాయి. పాటలూ బాగున్నాయి. సరిగమ సంస్థ తెలుగులో నిర్మించిన తొలి సినిమా ఇది. ‘క’ మంచి విజయాన్ని అందుకోవడంతో కిరణ్ ఊపుమీద ఉన్నాడు. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఇంకో మెట్టు ఎక్కినట్టే. ‘దిల్ రూబా’ కూడా ముందస్తుగానే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 13న ప్రీమియర్లు ప్రదర్శించే ఛాన్సుంది.