గత కొన్ని రోజులుగా బాక్సాఫీసు దగ్గర సందడి లేదు. సినిమాలు వస్తున్నాయి గానీ, అందులో నిలదొక్కుకున్నది బాక్సాఫీసు దగ్గర కాసులు దండుకున్నదీ కనిపించలేదు. ఈవారం ఏకంగా 12 సినిమాలు వస్తే.. ఒక్కటీ… ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోలేకపోయింది. ఈవారం మాత్రం… బాక్సాఫీసు దగ్గర ఊపు చూసే అవకాశం దక్కబోతోంది. నాని – ఎంసీఏ, అఖిల్ హలో చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. ఈ రెండింటిపైనా ఆశలు, అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తరవాత `హౌస్ ఫుల్` బోర్డులు చూసే అవకాశం తథ్యమనిపిస్తోంది.
ఏంసీఏ.. నాని సినిమా. అన్నింటకంటే దిల్‌రాజు.. ప్రొడక్ట్. ఓ సినిమాని పట్టాలెక్కించాలంటే వంద విధాలుగా ఆలోచిస్తాడు దిల్‌రాజు. తనకు నచ్చకపోతే… సినిమా అంగుళం కూడా కదలదు. కథ, కథనాలు, రిలీజ్ డేట్ విషయంలో పక్కాగా ఉంటాడాయన. అందుకే దిల్‌రాజు సినిమా వస్తోందంటే, ప్రేక్షకులలో ఓ భరోసా. దానికి తోడు `డబుల్ హ్యాట్రిక్ కొట్టి తీరతాం` అని బల్లగుద్ది చెబుతున్నాడు. మరోవైపు నాని స్పీడు చూస్తే మామూలుగా లేదు. ప్రతీ హీరో కలలుగనే ఫామ్ లో ఉన్నాడు. నాని నుంచి ఓ యావరేజ్ సినిమా వచ్చినా – అది హిట్టై కూర్చోంటోంది. అందుకే ఎంసీఏ పై అంత హైప్ వచ్చేసింది. కుర్రవాళ్లకి, మరీముఖ్యంగా మిడిల్ క్లాస్ అనబడ్డ ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చి తీరుతుందనిపిస్తుంది. ఫిదా తరవాత తెలుగులో సాయి పల్లవి కి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. నాని – సాయి పల్లవిలను జంటగా చూడాలనుకొనే యూత్.. తొలి రోజే ఈ సినిమా చూడాలని ఉత్సాహపడుతోంది. కాబట్టి గురువారం విడుదలయ్యే ఈ సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం ఖాయం.
మరి లాబ్ రిపోర్ట్, సెన్సార్ రిపోర్ట్ చూస్తే.. ఎంసీఏకి పాజిటీవ్ గానే ఉంది. ఫస్టాఫ్ నాని మార్క్ ఎంటర్టైన్మెంట్తో సినిమా సాగిపోతుందని, సగం సినిమాకే పైసా వసూల్ అనుభూతి కలుగుతుందని అంటున్నారు. అయితే సెకండాఫ్ కాస్త స్లో అయ్యిందట. అందులో నాని మార్క్ కామెడీ కూడా మిస్సయ్యిందని, రొటీన్ సన్నివేశాలు చాలా కనిపిస్తాయని, మళ్లీ క్లైమాక్స్‌కి ఊపందుకుంటుందని అంటున్నారు.
హలో విషయానికొస్తే.. అఖిల్ రెండో సినిమా ఇది. అఖిల్ ఫ్లాప్‌తో రివైంజ్ తీర్చుకోవాలని కసిగా కనిపిస్తున్నాడు అఖిల్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు కూడా. ప్రమోషన్ల పరంగానూ ఉధృతి పెంచాడు. విక్రమ్ కె.కుమార్ గురించి ఇక చెప్పక్కర్లెద్దు. అతని మార్క్ చూడడానికి, అతని స్ర్కీన్ ప్లేకి ముగ్థులైపోవడానికి ప్రేక్షకులు సదా సిద్ధంగానే ఉంటారు. నాగార్జున తెలివితేటలు కూడా ఈసినిమాకి యాడ్ అయ్యాడు. సో.. హలో సినిమాకీ భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. లాబ్ రిపోర్ట్ పరంగా చూస్తుకున్నా – హలోకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. యాక్షన్ సినిమాలో, అందమైన ప్రేమకథ మిక్స్ చేశాడని, విక్రమ్ తాలుకు సెన్సిటీవ్ నెస్, తెలివితేటలు స్ర్కీన్ ప్లేలో కనిపిస్తాయని అంటున్నారు. క్లైమాక్స్ మాత్రం కాస్త హెవీగా ఉందని, అయినా సరే – సర్ప్రైజ్ చేస్తుందని చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే… తూకం ఎంసీఏ కంటూ హలో వైపే మొగ్గు చూపుతుంది. మరి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.