వైకాపా ఎమ్మెల్యే రోజా శాసనసభలో ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా వ్యహరించినందుకు సభ నుండి ఏకంగా ఒక ఏడాది పాటు సస్పెండ్ చేయబడింది. దానిపై రోజా స్పందన చాలా విచిత్రంగా ఉంది. సస్పెండ్ చేయబడినందుకు బాధ పడటం లేదు సస్పెన్షన్ చేసిన తీరుకే నేను బాధపడుతున్నానని చెప్పారు. ఐదేళ్ళ కాల పరిమితిలో ఏకంగా ఒక ఏడాదిపాటు సస్పెండ్ చేయబడితే అందుకు బాధపడటం లేదని చెప్పగల ఏకైక ఎమ్మెల్యే రోజా మాత్రమేనేమో? కనీసం మాట వరుసకయినా స్పీకర్ ని కలిసి తనపై విధించిన సస్పెన్షన్ తొలగించమని లేదా తగ్గించమని కోరుతానని కానీ లేదా దీనిపై న్యాయపోరాటం చేస్తానని ఆమె అనకపోవడం విశేషం. ఇకపై నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడుతానని ఆమె అన్నారు. కానీ ఆమె ప్రజలలో కంటే టీవీ ఛానళ్ళలోనే ఎక్కువగా కనబడుతుంటారనే విషయం ప్రజలందరికీ తెలుసు. బహుశః అందుకే ఆమె బాధపడటం లేదేమో?
సభలో తను ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కూడా అధికార పార్టీ సభ్యులదే తప్పు అని వాదించడం బహుశః ఆమెకే చెల్లునేమో? అధికార పార్టీ సభ్యులు తనను రెచ్చగొట్టడం వలననే ఆ విధంగా ప్రవర్తించానని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యమంత్రితో దురుసుగా వ్యవహరించానని చెప్పుకొంటూనే మళ్ళీ ఒక మహిళ అని కూడా చూడకుండా స్పీకర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఏడాది పాటు సస్పెండ్ చేసారని విమర్శించారు. తప్పు చేసానని ఒప్పుకొంటూనే అందుకు శిక్ష పడకూడదని వాదించడం చాలా విచిత్రంగా ఉంది. తనను మహిళగా గౌరవించాలని ఆమె ఆశిస్తున్నప్పుడు ఆమె సభలో హుందాగా వ్యవహరించి ఉండాలి. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించి, మళ్ళీ ముఖ్యమంత్రి అర్ధాంగి భువనేశ్వరిని, వారి కోడలు బ్రాహ్మణి పేర్లను సభలో ప్రస్తావించడం మరొక పొరపాటు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రత ఎలా ఉందో నారా కుటుంబంలో మహిళలు భువనేశ్వరి, బ్రాహ్మిణిలే చెప్పాలన్నారు. వారిరువురూ ఏనాడూ ఈ రాజకీయాలలో కలుగజేసుకోలేదు. ఈ రాజకీయాలతో సంబంధం లేని మరో ఇద్దరు మహిళల గురించి రోజా సభలో మాట్లాడటమే తప్పు. సాటి మహిళల ప్రైవసీని ఆమె గౌరవించలేనప్పుడు ఆమె తనకు గౌరవం దక్కాలని ఎలాగ ఆశిస్తున్నారో ఆమెకే తెలియాలి.