ఇటీవల విశాఖలో నిర్వహించిన సి.ఐ.ఐ. భాగస్వామ్య సదస్సులో అనేక ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసాయి. వాటిలో ప్రపంచ ప్రసిద్ది చెందిన వాల్ మార్ట్ కూడా ఒకటి. వాల్ మార్ట్ ఇండియా, ఫ్యూచర్ గ్రూప్, స్పెన్సర్స్ మరియు అరవింద్ గ్రూప్ సంస్థలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో రూ. 1500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొన్నాయి.
వాల్ మార్ట్ సంస్థ భారత్ సి.ఈ.ఓ. క్రిష్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మూడు రీటెయిల్ షాపింగ్ మాల్స్ దిగ్విజయంగా నడుస్తున్నాయని, వాటికి అదనంగా కొత్తగా మరో 15 రీటెయిల్ షాపింగ్ మాల్స్ లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. తమ సంస్థ రాష్ట్రంలో చిన్న రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులలో శిక్షణ ఇచ్చి వారు పండించిన ఆహార ఉత్పత్తులను తమ రీటెయిల్ షాపింగ్ మాల్స్ ద్వారా అమ్మకాలు చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. వచ్చే 12-18 నెలలలోగానే తమ నూతన శాఖలు ప్రారంభమయ్యే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నామని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న అనేక చర్యల వలన దేశంలో దేశంలో వ్యాపారానికి అనుకూలమయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్తగా పరిశ్రమలు, వ్యాపార సంస్థల ఏర్పాటుకు అనుకూలమయిన పరిస్థితులు కల్పిస్తోందని ఆయన మెచ్చుకొన్నారు.