ఈ సంవత్సరం మనకు చాలా దివ్యంగా ఉండబోతున్నది.. రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ తీరబోతున్నాయి.. సమస్యలన్నీ పరిష్కరించేస్తాం.. అంటూ ప్రతి ప్రభుత్వాధినేత.. కొత్త సంవత్సరం ప్రారంభం కాబోయే ప్రతిసారీ మూస ప్రసంగం చేయడం మామూలే. కేసీఆర్ కూడా తన ఉగాది ప్రసంగంలో అలాంటి మామూలు డైలాగులు కొన్ని వల్లె వేశారు. అదే సమయంలో ఇద్దరు మంత్రుల గుండెల్లో ఆయన బాంబులు కూడా పేల్చారు.
రవీంద్ర భారతి లో జరిగిన దుర్ముఖి ఉగాది వేడుకల్లో కేసీఆర్ ప్రసంగం మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా సంకేతాలు ఇచ్చే తరహాలో సాగడం విశేషం. ఈ కొత్త సంవత్సరం అందరికీ చాలా బాగానే ఉంది అంటూ పంచాగంలోని రాశుల వారీ విశేషాలను నర్మగర్భంగా చెప్పిన కేసీఆర్.. మంత్రుల్లో కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి లకు మాత్రం బాగాలేదనం అనడం రాజకీయంగా కూడా చర్చనీయాంశం అవుతోంది.
మంత్రివర్గంలోకి కొత్త ముఖాలను తీసుకోవడానికి కొందరు పాతవారికి అనివార్యంగా ఉద్వాసన చెప్పవలసిన స్థితిలో ఉన్న కేసీఆర్.. అందుకు కసరత్తు ప్రారంభించారా అనే మాట వినిపిస్తోంది. మంత్రి కడియం శ్రీహరిని మంత్రి పదవినుంచి తప్పిస్తారని ఆయన స్థానంలో మరో దళిత ఎమ్మెల్యేకు చోటు కల్పిస్తారని చాలా కాలంనుంచి ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కడియం శ్రీహరికి ప్రాధాన్యం తగ్గించారనే సమాన హోదా గల మంచిపదవినే ఇస్తారని కూడా పుకార్లున్నాయి. మొత్తానికి వారిద్దరికీ రోజులు బాగా లేదనడంలోనే కేసీఆర్ పునర్వ్యవస్థీకరణ సంకేతాలు ఇస్తున్నారని అంతా అనుకుంటున్నారు.