హైదరాబాద్:ఎప్పుడు చూసినా సతీసమేతంగా హాయిగా గుళ్ళూ, గోపురాలకు, ఫంక్షన్లకు, షాపింగ్లకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుండే గవర్నర్ నరసింహన్కు ఓటుకు నోటు వివాదం పెద్ద తలనొప్పిగా మారింది. గవర్నర్ వ్యవహారశైలిపై వివిధ పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తెరాస తప్పితే అన్నిపార్టీల నాయకులూ గవర్నర్ను తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి నిన్న హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ ఆ పదవికి చేసిన రాజీనామా ఆమోదించకుండా గవర్నర్ ఆయనతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించటం రాజ్యాంగ ఉల్లంఘనే అని మర్రి అన్నారు. మరోవైపు సీపీఎమ్ సీనియర్ నాయకుడు నారాయణ గవర్నర్ రబ్బరు బొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విభజనబిల్లులో పొందుపరిచినట్లుగా సెక్షన్ 8ని అమలు చేయాలని, ఈ వ్యవహారంలో గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఇక తెలుగుదేశంపార్టీ ఒక అడుగు ముందుకెళ్ళి గవర్నర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించింది. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అనే సామెతలాగా ఓటుకునోటు వ్యవహారం – అటు తిరిగీ ఇటు తిరిగీ గవర్నర్ ప్రాణానికి తలనొప్పిగా మారిందనటంలో సందేహంలేదు. అసలు గవర్నర్నే మారుస్తారనే వార్తలుకూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి.