విజయవాడలో నిన్న జరిగిన తెదేపా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశ్యించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెదేపా ఏకపక్షంగా గెలవాలని, అందుకోసం పార్టీలో అందరూ సమిష్టిగా, నిజాయితీగా కృషి చేయాలని కోరారు. గత ఎన్నికలలో ప్రజలు తనపై నమ్మకంతోనే పార్టీకి అధికారం కట్టబెట్టారని, కనుక వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం అందరిపైనా ఉందని అన్నారు.
తాను కుప్పం నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపించడం చేత వరుసగా ఆరు సార్లు విజయం సాధించానని, అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలను కూడా ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసేందుకు గట్టిగా కృషి చేసినట్లయితే, వచ్చే ఎన్నికలలో వారు కూడా అవలీలగా ఘన విజయం సాధించగలరని చంద్రబాబు నాయుడు చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కి పెరిగే అవకాశం ఉంది కనుక పార్టీలోకి కొత్తగా వచ్చి చేరుతున్న వారిని చూసి పాతవారు కంగారు పడనవసరం లేదని అన్నారు. కొత్తవారి చేరిక కారణంగా చిరకాలంగా పార్టీకి సేవ చేస్తున్న వారికి అన్యాయం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో పాత, కొత్త నేతల కలయికతో రాష్ట్రంలో ఏవిధంగా అధికారంలోకి వచ్చేమో అదేవిధంగా వచ్చే ఎన్నికలలో కూడా విజయం సాధించాలంటే అందరూ కలిసిమెలిసి పనిచేయాలని కోరారు.
అయితే ఆయన చెప్పిన హిత వాఖ్యాలు తెలుగు తమ్ముళ్ళు, తెదేపాలో చేరుతున్న వైకాపా సోదరులు చెవిన పెడతారా? అంటే అనుమానమే. వారం రోజుల క్రితమే తెదేపాలో చేరిన ఆదినారాయణ రెడ్డి పార్టీలో సీనియర్ నేత రామసుబ్బారెడ్డికి అప్పుడే వార్నింగ్ ఇవ్వడం, వైకాపా ఎమ్మెల్యేల చేరికల పట్ల పార్టీలో సీనియర్లు మీడియా ముందుకు వచ్చి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనిస్తే అది అర్ధమవుతుంది.
ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయం కూడా ఆ బిజినెస్ లో కోట్లు సంపాదిస్తున్న తెదేపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా అనేక ఇతర సమస్యలు, కారణాల చేత ప్రస్తుతం తెదేపాలో కొంత అసంతృప్తి నెలకొని ఉంది. పార్టీలో ఇటువంటి పరిస్థితులు ఉంటే అందరికీ కుంపటి మీద కూర్చోన్నట్లే ఉంటుంది. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు చెపుతున్న ఈ హిత వాక్యాలు వారి చెవులకు ఎక్కుతాయా? అంటే అనుమానమే.