* ఎన్నికలకు ముందే జగన్ పార్టీని ఖాళీ చేసే బాబు ఎత్తుగడ * ఎమ్మెల్యేల కట్టడికి ప్రతిపక్షంలో త్రిముఖ వ్యూహం * నాయకుడిపై అపనమ్మకమే వలసలకు ప్రధాన కారణం * భవిష్యత్తుపై తెలుగుదేశంలో పాతవారి ఆందోళన * కులసమీకరణలే జగన్ కి రేపటి ఆశ
తెలుగుదేశం మొదలు పెట్టిన ”ఎమ్మెల్యేల ఆకర్ష్” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు తెలుగుదేశంలో చాలాకాలంగా వున్న సీనియర్ నాయకులను కూడా కలవరపెడుతోంది. ఆర్ధిక నేరాల కేసుల్లో జగన్ ఒక పక్క ఉక్కిరిబిక్కిరౌతున్న దశలోనే ఆయన పార్టీని ఖాళీ చేసి వచ్చే ఎన్నికల నాటికి ఎదురు వుండకూడదన్నదే చంద్రబాబు వ్యూహం. 21 మంది ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారు వారు వచ్చిన గంటలో ప్రభుత్వాన్ని పడేస్తాను అని జగన్ అనడాన్ని టైమింగ్ గా తీసుకుని చంద్రబాబు ఆకర్ష్ కు స్విచ్చాన్ చేశారు. మొత్తం 67 మందిలో మిగిలివున్న వారినైనా నిలబెట్టుకోడానికి జగన్ త్రిముఖ వ్యూహాన్ని రూపొందించుకున్నారు. చంద్రబాబు పలుకుబడి వేగంగా పతనమౌతున్నందువల్ల భవిష్యత్తు తమదేనని, ఇందువల్ల పార్టీ వదలి వెళ్ళరాదని జిల్లాల వారీగా ఎమ్మెల్యేలకు, ప్రముఖ నాయకులకు నచ్చజెప్పే బాధ్యతలను జిల్లాలవారీగా పార్టీ సీనియర్ నాయకులకు అప్పగించారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ పై వత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. బహిరంగసభలు నిర్వహించి ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతున్న చంద్రబాబు దివాళాకోరుతనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని భావిస్తున్నారు. ఈ మూడు చర్యలవల్లా పార్టీ నుంచి వెళ్ళిపోదలచిన వారిపై మోరల్ ప్రెజర్ పెరుగుతుందన్నది జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్ల ఆలోచన. ఇందుకు జగన్ ఆమోదించారు. అయితే చంద్రబాబు ఆకర్ష్ ముందు జగన్ ఎమ్మెల్యేలు నిలబడే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ లలోని ఉన్నత స్ధాయి వర్గాల సమాచారం ప్రకారం కనీసం 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వలసపోవడానికి సిద్ధంగా వున్నారు. ఈ పరిస్ధితిని నివారించడానికి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో శుక్రవారం హైదరాబాద్ లో సమావేశమౌతున్నారు. వారి సమస్యలు, కష్టనష్టాలు, భవిష్యత్తు మీద జగన్ హామీలు ఇవ్వగలిగితే వలసపోయేవారి సంఖ్య బాగా తగ్గవచ్చని ఆపార్టీ వర్గాలు భావిస్తున్నాయి. “హామీల కంటే తన పద్ధతి మారుతుంది అని తమకు నమ్మకం కలిగించడమే పార్టీని నిలబెడుతుంది. ఆయనకు ఎదుటి వాళ్ళు చెప్పే మాట వినే అలవాటు లేదు. పార్టీ ఖాళీ అయ్యే సంక్లిష్టత వల్ల అయినా జగన్ తీరు మారుతుందని ఆశిస్తున్నాము” అని ఆపార్టీ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఎవరిమాటా వినని జగన్ మొండి స్వభావం, ఆయనపై బిగుసుకుంటున్న కేసుల కారణం గా ఎన్నికల నాటికి పార్టీ నాయకుడు ఎక్కడ వుంటారోనన్న అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆలోచనల్లో పడేశాయి. కోట్ల రూపాయల ఖర్చుతో గెలిచినా వదలని అప్పుల భారాలు, పనులు చేయించుకుందామంటే మాట వినని అధికారుల ధోరణుల వల్ల వీరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. ఇదే అదనుగా తిరిగి టకెట్ ఇవ్వడానికి హామీలు, ఈ మూడేళ్ళూ “పనులు చేయించుకోడానికి” అడిగిన పదవులు ఇస్తామన్న హామీలను తెలుగుదేశం పెద్దలు ఎరవేసి ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను కలిపేసుకుంటున్నారు. ఇందులో తెలుగుదేశం ఎరల కంటే జగన్ మీద అపనమ్మకమే ఆయన పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశంలోక సాగనంపుతున్నట్టు వుంది. ఈ పరిస్ధితి తెలుగుదేశంలో సీనియర్లకు మింగుడు పడటంలేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం కలిపేసుకున్న కాంగ్రెస్ వాళ్ళతోనే పాత తెలుగుదేశం వాళ్ళకి అనేక చోట్ల సఖ్యత కుదరడం లేదు. ఇపుడు మరో భారీ విలీనం వల్ల కంపేటబిలిటీ సమస్య ఇంకా పెరుగుతుందన్నది వారి వాదన.వచ్చే ఎన్నికల్లో కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తే తమ సంగతి ఏమిటన్నది అసలు భయం. కడప జిల్లాలో జగన్ పార్టీ నుంచి మైసూరా రెడ్డిని తెచ్చుకోవడం అదే జిల్లాక చెందిన తెలుగుదేశం పాత నాయకుడు సిఎం రమేష్ కి అభ్యంతరంగా వుండటాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాష్ట్రవిభజన అనంతర పరిణామాలను దృష్టిలో వుంచుకుని ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ సీట్లు మరో 50 పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి రాశారు. అలాగే తెలంగాణాలో కొత్తగా 34 సీట్లు పెంచాలని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. పాతిక ముప్పై ఏళ్ళకు గాని నియోజకవర్గాల పునర్యవస్ధీకరణ జరగదు. ఇందువల్ల ఇప్పట్లో కొత్తసీట్లు రావన్నది ఒక వాదన. రాష్ట్ర విభజన నేపధ్యంలో కేంద్రం అనుకుంటే పునర్యవస్ధీకరణ అసాధ్యం కాదని మరో వాదన. రెండు రాష్ట్రాలూ కోరితే సీట్లు పెంచడానికి సమస్య లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్ లో పాతతెలుగుదేశం వారికి, వలస వచ్చిన కొత్తవారికీ, అలాగే తెలంగాణాలో అసలైన టిఆర్ఎస్ వారికి, కొత్తగా వలసవచ్చిన వారికీ కొంత రిలీఫ్ ఇస్తోంది. అధికారాన్ని పంచుకోవడంలో రెడ్డి సామాజిక వర్గానికి, కమ్మసామాజిక వర్గానికి మధ్య ఎప్పుడూ రాజీ లేదు. ఇందువల్ల ఇపుడు రెడ్డి వర్గం వారు భారీగా తెలుగుదేశంలోకి వలసపోయినా అక్కడ నిలబడలేరన్నది ఒక అంచనా. విభజన అనంతరం జిల్లాలు తగ్గిపోయిన ఆంధ్రప్రదేశ్ లో కాపుల సంఖ్య జయాపజయాలను ప్రభావితం చేయగలిగినంత ఎక్కువ. కాపులకు రెడ్లకు కుదిరే జోడీ కమ్మలతో కుదరదన్నది ఇప్పటి వరకూ వున్న అనుభవం. ఏడాదిలో తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది అంటున్న జగన్ జోస్యానికి ఈ అంచనా, ఈ అనుభవం మూలం కావచ్చు!