హైదరాబాద్ లో అక్రమకట్టడాల క్రమబద్దీకరణ అంశంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్ లేని తెలంగాణా రాష్ట్రానికి ఒప్పుకొన్నట్లయితే 12 ఏళ్ల క్రితమే వచ్చేదని కానీ తను తీవ్రంగా వ్యతిరేకించానని, హైదరాబాద్ దక్కించుకోవడానికి తను ప్రాణాలు ఒడ్డి పోరాడవలసి వచ్చిందని చివరికి కోరుకోన్నట్లే హైదరాబాద్ తో కూడిన రాష్ట్రాన్ని సాధించుకొన్నామని తెలిపారు. హైదరాబాద్ వద్దనుకొంటే 12 ఏళ్ల క్రితమే తెలంగాణా ఏర్పడేదంటే దానర్ధం ఆయన తెలంగాణా కోసం ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలోనే తెలంగాణా ఏర్పాటుకు అవకాశం ఉందని దృవీకరిస్తున్నట్లుంది. ఒకవేళ 12 ఏళ్ల క్రితమే కేసీఆర్ ఈ హైదరాబాద్ విషయాన్ని ప్రజలు, ఇతర రాజకీయ పార్టీల ముందుంచి ఉంటే అప్పుడే ఈ సమస్య పరిష్కారమయ్యి ఉండేదేమో? కానీ కేసీఆర్ ఈ విషయం బహిర్గతం చేయకుండా తెలంగాణా సాధన కోసం ఉద్యమాలు చేసారు?
రాష్ట్ర విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వస్తున్న సమయంలో మళ్ళీ ఈ అంశం తెరపైకి వచ్చింది. కనీసం హైదరాబాద్ ని కేంద్ర పాలిత రాష్ట్రంగా మార్చమని ఆంధ్రాకు చెందిన నేతలు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసారు. ఆ ప్రతిపాదనలను తెలంగాణాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా వ్యతిరేకించడంతో చివరికి పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేస్తూ రాష్ట్ర విభజన చేయబడింది. అంటే ఒకవేళ 12ఏళ్ల క్రితమే ఇటువంటి ప్రతిపాదనలు వచ్చినా అప్పుడూ అందరూ కలిసి దానిని వ్యతిరేకించి తెలంగాణా సాధించుకోనేవారని స్పష్టమవుతోంది. తను అవిశ్రాంతంగా చేసిన ఆ ఉద్యమాల ద్వారా హైదరాబాద్ కూడిన తెలంగాణా రాష్ట్రం సాధించగలిగానని కేసీఆర్ చెప్పుకొన్నారు. అందులో సందేహం లేదు. కానీ ఆ ఉద్యమాల ద్వారానే ఆయన, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణాలో ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదిగి చివరికి అధికారం కూడా చిక్కించుకోగలిగారని అందరికీ తెలుసు.హైదరాబాద్ తో కూడిన రాష్ట్రం కోసం తను ప్రాణాల మీదకు తెచ్చుకొన్నానని కేసీఆర్ చెప్పుకొన్నారు. ఆవిధంగా చెప్పుకోవడం ద్వారా తెలంగాణా కోసం తానొక్కడినే ప్రాణాలు ఒడ్డి పోరాడినట్లు గొప్పలు చెప్పుకొంటున్నట్లుంది. కానీ తెలంగాణా కోసం వందలాది విద్యార్ధులు, యువకులు తమ ప్రాణాలనే తృణప్రాయంగా త్యజించారు. అటువంటప్పుడు ఎవరు త్యాగమూర్తులు? కేసీఆరా లేక ఆ అమరవీరులా?