హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఈ నెల 15న పోలీసులు జరిపిన ఎన్కౌంటర్కుగానూ తెలంగాణ ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్ట్ పార్టీ హెచ్చరించింది. ఈ ఎన్కౌంటర్కు నిరసనగా ఈనెల 28న ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో బంద్కు పిలుపునిచ్చింది. మావోయిస్ట్ పార్టీ ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల(కేకేడబ్ల్యూ) కార్యదర్శి దామోదర్ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులు శృతి, విద్యాసాగర్ రెడ్డిలను ముందు గోవిందరావుపేట మండలంలోని అడవులలో అరెస్ట్ చేశారని, ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారులకు, మంత్రులకుకూడా తెలుసని పేర్కొన్నారు. వారిద్దరినీ చంపటానికి ముందు శృతిని పోలీసులు చిత్రహింసలు పెట్టారని, ఆ చిత్రహింసల ఆనవాళ్ళు కనపడకుండా చేయటంకోసం ఆమె శరీరంపై యాసిడ్ పోశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఇసుక, అటవీ, గ్రానైట్ మాఫియాలకు కాపుగాస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు ఇంత దారుణం ఉమ్మడి రాష్ట్రంలోకూడా జరగలేదని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ముఖ్యమంత్రి అసలు రంగు బయటపడిందని చెప్పారు. ఇక విరసం వ్యవస్థాపకుడు వరవరరావు ఎన్కౌంటర్ ఘటనకు నిరసనగా ఈనెల 30న చలోఅసెంబ్లీ ర్యాలీకి పిలుపునిచ్చారు. తెలంగాణలోని వనరులను దోచుకుంటున్న మాఫియాలకు కేసీఆర్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు.