నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించి తన ఆధీనంలోని 64 ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టింది. ఆయన విమాన ప్రమాదంలో బయటపడ్డారా లేక మరణించారా అనే మిస్టరీ మాత్రం వీడలేదు.
అసలు ఈ విషయానికి సంబంధించి 64 ఫైళ్లలో ఎక్కడా సాధికారికమైన వివరణ లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ ఫైళ్లలో ఎక్కువగా నేతాజీ పోరాట ఘట్టానికి సంబంధించిన విషయాలు, ఆజాద్ హిండ్ ఫౌజ్ కు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
1947 నుంచి దశాబ్దంపైగా నేతాజీ బంధువులపై అప్పటి నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయం గురించి చాలా ఫైళ్లలో వివరాలున్నాయి. నేతాజీ సోదరుల కుమారులకు, జపాన్, ఇతర దేశాల వారికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఈ వివరాలున్నాయి.
నెహ్రూ ప్రభుత్వం ఇందుకోసం గూఢచారులను ఉపయోగించిందని ఉత్తరాల్లో రాసిన విషయం వెల్లడైంది. అయోధ్యలోని ఫైజాబాద్ లో ఆమధ్య గుమ్నామీ బాబా పేరుతో ఆశ్రమంలో జీవించింది నేతాజీయా కాదా అనేదానిపైనా ఈ ఫైళ్లలో ఎలాంటి వివరాలు లేవు.
మొత్తం మీద ఈ ఫైళ్లను చదివితే ఒక విషయం స్పష్టమవుతుంది. 1945 లో విమాన ప్రమాదం జరిగింది. అయితే 1960వ దశకం వరకూ నేతాజీ జీవించే ఉన్నారని చాలా మంది చరిత్రకారులు, భారత, జపాన్, అమెరికా అధికారులు భావించారు. వారి అభిప్రాయాలకు సంబంధించిన వివరాలున్నాయి. అయితే దీనికి ఆధారం ఏమిటనేది మాత్రం ఎవరూ చెప్పలేదు. అంటే అవన్నీ ఊహాగానలు, లేకా అంచనాలు మాత్రమే. ఇంతా చేసి ఈ ఫైళ్ల వెల్లడి వల్ల అదనంగా తెలిసిన సమాచారం ఏదీ లేదని విశ్లేషకులు తేల్చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫైళ్లను బయటపెడితే ఏమైనా అదనపు వివరాలు తెలియవచ్చని అభిప్రాయపడుతున్నారు.