జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక విలేఖరి “యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ మరణించినపుడు అన్ని రాజకీయ పార్టీల నేతలు వచ్చేరు కానీ మీరు మాత్రం రాలేదు. కనీసం స్పందించలేదు. ఎందుకు?” అని ప్రశ్నించారు. దానికి పవన్ కళ్యాణ్ జవాబు చెపుతూ “రోహిత్ వంటి చాలా ప్రతిభ గల విద్యార్ధి మరణించడం నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులే కులాలను ప్రోత్సహించడం, విద్యార్ధులు కూడా ఆ ప్రభావానికి గురవడం మనం చాలా కాలంగా చూస్తున్నాము. ఆ కారణంగానే విద్యార్ధుల మధ్య గొడవలు, వివక్షవంటివి తలెత్తుతున్నాయి. రోహిత్ మరణానికి కూడా అదే కారణం కావడం చాలా బాధ కలిగించింది. రాజకీయ నేతలు అందరూ వచ్చి అతని మరణాన్ని కూడా రాజకీయం చేసారు. యూనివర్సిటికి సంబంధించిన ఒక సమస్యను జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళారు. వారిలో నేను కూడా ఒకడినవడం ఇష్టం లేకనే నేను రాలేదు. మాట్లాడలేదు. కానీ దానర్ధం రోహిత్ మరణానికి నేను బాధపడలేదని కాదు,” అని అన్నారు.
“రోహిత్ మృతికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ వ్రాయడమే కారణం కదా?” అని ఒక విలేఖరి ప్రశ్నించినపుడు, “ఈ సమస్య అంతకంటే చాలా కాలం ముందు నుంచే యూనివర్సిటీలో కొనసాగుతోంది. కనుక బండారు దత్తాత్రేయను నిందించలేము,” అని పవన్ కళ్యాణ్ జవాబిచ్చారు.