చరిత్రాత్మక గయ పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ యువతకు గాలం వేశారు. బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ఆయన ఎంచుకున్న అంశాలు ఎంతో వ్యూహాత్మకం. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందనే మాటను పదే పదే ప్రస్తావిస్తూ జేడీయూ, ఆర్జేడీలపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసిన వ్యాపం కుంభకోణం ప్రభావం బీహార్ ఎన్నికలపై పడకుండా, ఆ రాష్ట్రంలోని అభివృద్ధిని ప్రస్తావించారు. జైలుకు వెళ్లిన అవినీతి పరుల మాటలను నమ్మవద్దంటూ లాలు ప్రసాద్ యాదవ్ చరిత్రను ప్రస్తావించారు. వ్యాపం ప్రభావాన్ని అడ్డుకోవడానికి బీజేపీ తగిన ప్లాన్ ను రచించుకుందని స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక, పెద్ద సంఖ్యలో ఓటర్లను బీజేప వైపు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగా యువ ఓటర్లే లక్ష్యంగా మోడీ ప్రచారం మొదలైంది. పెద్ద సంఖ్యలో ఉన్న యువతను ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరించగలిగితే రెండందాల ప్రయోజనం. యువతతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఆకర్షఇంచ వచ్చు. అందుకే, బీహార్ కంటే చిన్న రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తారఖండ్ లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయో వివరించారు. ఇంత పెద్ద బీహార్లో కేవలం 25 వేల ఇంజిరీంగ్ సీట్లున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనంటూ నితీష్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆలోచన మొదలవుతుంది. ఇంజీనిరింగ్ సీట్లు తక్కువగా ఉండటం వల్ల మామూలు చాలా మంది మామూలు డిగ్రీ చదవాల్సి వస్తోంది. అందుకే మామూలు ఉద్యోగాలు చేయాల్సి వస్తోందనే ఆలోచన కలుగుతుంది. సీట్లు పెరిగి అవకాశాలు పెరిగితే మెరుగైన జీవితం లభిస్తుందనే ఆశ కలుగుతుంది. అలా, విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఆలోచించ చేయడం మోడీ వ్యూహమని అర్థమవుతోంది. కులాలవారీగా చీలిన బీహార్ రాజకీయ రంగంలో, ప్రత్యర్థుల మీద పైచేయి సాధించాలంటే యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే సరైందని మోడీ భావించినట్టు కనిపిస్తోంది.
మోడీ మేజిక్ ఇంకా పనిచేస్తుందా లేదా అనే విషయంపై బీజేపీ పెద్దగా దృష్టి పెట్టిందా లేదా అనేది వేరే విషయం. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం అనే విషయంలో మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో తగిలిన ఒటమి దెబ్బ, బీజేపీకి కనువిప్పు కలిగించింది. అందుకే, సమయోచితమైన వ్యూహాలతో, యువ ఓటర్ల అండతో బీహార్లో గెలవాలని ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది.