బ్రహ్మానందం తనయుడు గౌతమ్ నుంచి ఓ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. తను చేసిన బసంతి, మను చిత్రాలు మంచి ప్రయత్నాలుగా నిలిచినా కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు. రీసెంట్ గా విక్రమ్ కె.కుమార్ వెబ్ సిరీస్ ‘దూత’లో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు. ఇంతకాలానికి తను హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంది. అదే ‘బ్రహ్మా ఆనందం’. ఇందులో బ్రహ్మానందం గౌతమ్ తాతయ్యగా కనిపించబోతున్నాడు. డిసెంబరు 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈరోజు రాఖీ సందర్భంగా టీజర్ వదిలారు.
ఈ టీజర్లో గౌతమ్, వెన్నెల కిషోర్ పాత్రల్ని పరిచయం చేశారు. చివర్లో బ్రహ్మానందం పంచె కట్టుకొని స్టైల్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రతీ పాత్రకూ ఓ ఫస్ట్రేషన్ ఉంది. గౌతమ్ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. చెల్లాయి రాఖీ కడితే, గిఫ్టుగా ఆ రాఖీనే తిరిగి ఇచ్చేసే దీన స్థితిలో ఉంటాడు హీరో. వెన్నెల కిషోర్ పేరుకే డాక్టర్. తనక్కూడా బోల్డన్ని చిరాకులు, పరాకులు. వీళ్ల గోలేంటి? ఈ పాత్రల మధ్య బ్రహ్మానందం వచ్చి ఏం చేశాడు? అనేది తెరపై చూడాలి. ప్రియావడ్లమాని, ఐశ్వర్య హొలక్కల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకుడు. మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, మసూధ లాంటి హిట్ సినిమాల్ని అందించిన రాహుల్ యాదవ్ నిర్మాత. టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. కథేమిటి? ఏ జోనర్ లాంటి పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.