మూడు నాలుగేళ్ళ క్రితం అల్లరి నరేష్ సినిమా అంటే మిమిమం గ్యారంటీ. హిట్టయితే జాక్ పాట్. మిస్సయినా మినిమం ప్రాఫిట్స్. అయితే మూడు నాలుగేళ్ళ లో మొత్తం మారిపోయింది. కనీసం బయ్యర్స్ కూడా ముందుకు రాని పరిస్థితి. సుడిగాడు తర్వాత నరేష్ తీసిన సినిమాలన్నీ బోల్తా పడటమే కారణం. అయితే తరచి చూస్తే నరేష్ పరిస్థితి కి మరిన్ని కారణాలు కూడా కనిపిస్తాయి.
దురదృష్టవశాత్తూ ఇవివి సత్యనారాయణ మరణించడం కూడా నరేష్ కెరీర్ నెమ్మదించడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఆయన ఉన్నపుడు నరేష్ కెరీర్ డౌన్ అయినప్పుడల్ల తానే ఒక హిట్టిచ్చి ఆ కెరీర్ ని నిలబెట్టేవాడు. అంతే కాక స్వతహాగా దర్శకుడు కావడం వల్ల నరేష్ కి స్క్రిప్ట్ సెలెక్షన్ లోనూ సాయం చేసేవాడు. ఇవివి మరణించాక నరేష్ కి సరైన స్క్రిప్ట్ పడకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక రెండోది, సుడిగాడు కి ముందు నరేష్ చాలా సినిమాల్లో పాపులర్ హీరోల స్పూఫ్ లు కామెడీ గా చేసేవాడు, అవి జనాలకి నచ్చేవి. పూర్తి స్పూఫ్ ల తో నింపిన సుడిగాడు కూడా సూపర్ హిట్టయింది. కానీ ఆ తర్వాత జబర్దస్త్ షో స్తార్టవడం, ఆ తరహా స్పూఫ్ లు టివిల్లోనే జనానికి కనిపిస్తుండటం తో జనాలకి స్పూఫ్ ల మీద ఆసక్తి తగ్గింది. అదీ కాక జబర్దస్త్ కి మించి సినిమాల్లో కామెడీ పండించడం కూడా రచయితలకి సవాల్ గా మారింది. సో, పూర్తిగా కామెడీ నిండిన స్క్రిప్ట్ లు కాకుండా కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకుని తీరాల్సిన ఆగత్యం నరేష్ కి ఏర్పడింది.
ఈ సారి ఒరు వడక్కన్ సెల్ఫీ అనే మళయాల రీమేక్ తో ముందుకొస్తున్నాడు అల్లరి నరేష్. సెల్ఫీ నేపథ్యం లో ఉండే కామెడీ థ్రిల్లర్ ఇది. ఒక సెల్ఫీ కారణంగా జీవితాలు తిరగబడే ఈ కథ లో కామెడీ కంటే సస్పెన్సే ఎక్కువ డామినేట్ చేస్తుంది. గతం లో సెల్ఫీ నేపథ్యం లో తీసిన సెల్ఫీ రాజా సినిమా తో బోల్తాపడ్డ నరేష్ ని ఈ కామెడీ సెల్ఫీ ఎంతవరకు గట్టెక్కిస్తుందో చూడాలి. అదీ గాక ఏ జబర్దస్త్ కారణంగా తన కెరీర్ డల్ అయిందో, ఆ జబర్దస్త్ లో టాప్ కమెడియన్ హైపర్ ఆది ని ఆసరాగా పెట్టుకుని వస్స్తున్న ఈ సినిమా రేపు విడుదల కానుంది. మేడమీద అబ్బాయి గాడిలోకి పడేదీ లేనిదీ కొద్ది గంటల్లో తెలిసిపోతుంది.