ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుని విచ్చలవిడిగా ఓటు బ్యాంకుకు పథకాల పేరుతో పంపిణీ చేస్తున్న వైనంపై.. కేంద్రమాజీ మంత్రి సురేష్ ప్రభు తాజాగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఒక్క రోజు ముందే నిర్మలా సీతారామన్‌కు.. పీయూష్ గోయల్‌కు కూడా లేఖలు రాసిన ఆయన.. తాజాగా ప్రధానమంత్రి మోడీకి కూడా రాశారు. పట్టు వదలకుండా.. సురేష్ ప్రభు ఇలా వరుసగా లేఖలు రాయడం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది. నిజానికి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ ఎంపీనే. అయితే.. ఆంధ్రప్రదేస్ ప్రయోజనాల కోసం కానీ.. ఏపీ విషయాల్లో కానీ ఆయన ఎక్కడా పెద్దగా మాట్లాడినట్లుగా రికార్డు కాలేదు. టీడీపీ హయాంలో.. బీజేపీతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఓ రాజ్యసభ సీటును టీడీపీ ఇచ్చింది.
అది అప్పట్లో రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభుకు బీజేపీ కేటాయించింది. దాంతో ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉన్నారు. అంతకు మించి.. ఏపీకి ప్రత్యేకంగా ఆయన కంట్రిబ్యూట్ చేసిందేమీ లేదు. హఠాత్తుగా.. ఏపీ ఆర్థిక పరిస్థితి.. అప్పులు తీసుకుంటున్న వైనం.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు వంటి వాటిపై ఆయన స్పందించడం ప్రారంభించారు. నిజానికి ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయం. రెవిన్యూ లోటు ఒక్క ఏడాదిలో అరవై వేల కోట్లకు చేరిందంటే.. అది మామూలు విషయం కాదు. కొలాప్స్ అవడానికి చివరి మెట్టు మీదే ఉన్నట్లే లెక్క.
అయితే ప్రభుత్వం వినూత్న మార్గాల ద్వారా అప్పుల సేకరణ జరిపి.. బండి నెట్టుకొస్తోంది. ఇలాంటి సమయంలో.. ఏపీకి అప్పులు కూడా దొరకూడదన్నట్లుగా సురేష్ ప్రభు లేఖలు రాయడం మాత్రం.. ఆసక్తికరంగా మారింది. ఆయనతో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అలా రాయిస్తున్నారా లేకపోతే.. ఆయనే ఈ లేఖలు.. ఏపీ ఆర్థిక పరిస్థితిని చూసి కంగారు పడి రాస్తున్నారా.. అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. సురేష్ ప్రభును మోడీ కూడా ఓ ఇంటెలెక్చువల్‌గా చూస్తారు. ఆయన లేఖకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మేరకు.. కేంద్రం వైపు నుంచి ఏపీకి అప్పులు రాకుండా.. ఏమైనా చర్యలు తీసుకుంటే మాత్రం.. సురేష్ ప్రభు ఈ విషయంలో సక్సెస్ అయినట్లే. ఏపీ సర్కార్ మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది.