నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పరస్పర ఆరోపణలు వాతావరణాన్ని ఉద్రిక్తం చేస్తున్నాయి. మేమే గెలుస్తామంటూనే ప్రధాన పోటీదారులైన టిడిపి వైసీపీలు అవతలివారు వాయిదా వేయించేందుకు కుట్ర పన్నుతున్నారని దాడి చేస్తున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు,వైసీపీ నేతలు భూమన కరుణాకరరెడ్డి, అంబటి రాంబాబు వంటివారు అవతలివారికి కుట్రను ఆపాదిస్తూ మాట్లాడ్డం విచిత్రం. ఇక మూడో పోటీదారు కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నిక వాయిదా వేయాలని కోరింది. పైకి మేమే మేమే అంటున్నాఎవరికి వారికి అభద్రత అనిశ్చితి వెన్నాడుతున్నాయని ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఉప ఎన్నిక మూడేళ్ల పాలనపై రెఫరెండం అనీ, వచ్చే ఎన్నికలకు నాంది అని ఎక్కువగా చెప్పడం మంచిది కాదని కూడా ఇరుపక్షాలూ అనుకుంటున్నాయి. ఎందుకంటే దీనివల్ల తనకంటే ప్రభుత్వానికి తక్కువ నష్టం అని వైసీపీ గ్రహించింది. ఎన్నిక న్యాయంగా జరగడం లేదు గనక అలా అనడం పొరబాటని సాక్షి చర్చలో కొమ్మినేని శ్రీనివాసరావు కూడా సర్దుబాటు చేశారు. నిజంగా అంత విశ్వాసమే వుంటే జగన్ దీర్ఘమకాం, చంద్రబాబు మరో దఫా పర్యటన అవసరముండేవి కావు.
ఇది ఇలా వుంటే డబ్బుల పంపకం విషయంలోనూ పరస్పర ఆరోపణలు పెరిగిపోతున్నాయి. పంపిణీ మొత్తంలో తేడా వున్నా పంచడంలో ఎవరూ వెనకబడింది లేదు. అయితే పోలీసులు అధికార పార్టీ వారిని వదలిపెట్టి మావారినే వెంటాడుతున్నారని వైసీపీ అంటోంది. శుక్రవారం నాడు కూడా ఇదే ఆరోపణలపై ఏడుగురు వైసీపీ అభిమానులను అరెస్టు చేసి కొంత సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. మరోవైపున నటుడు బాలయ్య నగదు పంచుతున్నట్టు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఏ కారణంగా అంత బహిరంగంగా డబ్బులిస్తూ ఫోటోలకెక్కారో అర్థం కావడం లేదు. తాజాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఒక వాహనాన్ని ఎన్నికల పరిశీలకుడు పరిశీలించడానికి వెళ్లగా డ్రైవర్ ఇతరులు ఒప్పుకోలేదు.వైసీపీ వారు కూడా అక్కడకు వచ్చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. ముఖ్యమంత్రి పర్యటన కారణంగా ఆహారం కోసం ప్యాంట్రీ కారు వచ్చిందని పోలీసుల వివరణ.అయితే చూపించడానికి అభ్యంతరం దేనికని స్థానికుల ప్రశ్న. రాత్రి పూట మకాం వుంటే ఈ వాహనం వస్తుందట. ఇక్కడ రెండు రోజులుంటున్నారు గనక వచ్చివుండొచ్చు గాని ఎన్నికల పరిశీలకుడి తనిఖీని అనుమతించకపోవడం అనుమానాలు పెంచింది. చివరకు ఏదో విదంగా మమ అనిపిస్తారు.