విజయసాయిరెడ్డి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారని తాము గేట్లు మూసేశామని అచ్చెన్నాయుడు చేసిన ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో మాస్టర్ మైండ్. ఆయన ఏ-2 కావొచ్చు కానీ. మొత్తం గుట్టు ఆయన చేతుల్లో ఉంటుంది. ఆయన చెప్పాలనుకుంటే మొత్తం చెప్పేయగలరు. అలాంటి వ్యక్తి టీడీపీలోకి వస్తానంటే చేర్చుకుని జగన్ కేసుల్లో అప్రూవర్ గా మార్చేయడానికి టీడీపీ ప్రయత్నించి ఉండేది. అందుకే ఎక్కువ మంది అచ్చెన్న ప్రకటనను నమ్మలేదు. అదొ పొలిటికల్ జిమ్మిక్ అనుకుంటున్నారు.
కానీ వాస్తవం ఏమిటంటే.. ఆయన టీడీపీలో చేరేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరుతానని .. తన రాజ్యసభ సభ్యత్వం మళ్లీ తనకు గ్యారంటీ ఇస్తే చాలని ఆయన బేరం పెట్టారు. అది కూడా చాలా పెద్ద స్థాయి వ్యక్తులతోనే సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఆ వ్యక్తుల స్థాయికి అయినా గౌరవం ఇచ్చి టీడీపీ ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లుగా నటించింది. నిజానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయనను చేర్చుకోవాలని టీడీపీ అనుకోలేదు. ఆ పరిశీలన సమయంలో విజయసాయిరెడ్డి .. ఎలాంటి ట్వీట్లు చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. చేర్చుకోవడం అసాధ్యం అని కృష్ణయ్య రాజీనామా తర్వాత తేలడంతో ఆయన మళ్లీ తన పద్దతిలోకి వెళ్లారు.
బీజేపీలోకి వెళ్లేందుకు కూడా విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేశారు. రాజ్యసభ సీటు వస్తుందని తెలిసినా ఆయనను చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు ఆసక్తి చూపించలేదని అంటున్నారు. ఇదంతా తెలిసే జగన్ రెడ్డి ఆయనను కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వైసీపీ వైపు నుంచి ఏ సమాచారం కానీ.. ఏ సమావేశానికి కానీ ఆయనకు పిలుపు రావడం లేదు. విజయసాయిరెడ్డి పూర్తిగా ఒంటరయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.