వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేస్తే జగన్ మోహన్ రెడ్డి ట్వీట్లు పెట్టారు. ప్రెస్మీట్ కూడా పెట్టారు. కానీ ఈ రోజు ఓ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేస్తే కనీసం ట్వీట్ కూడా పెట్టలేదు. ఆయన కాకపోతే ఆయన షాడో సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ప్రెస్మీట్ పెట్టలేదు. కానీ పార్టీ కీలక నేతల గ్రూపులో ఓ మెసెజ్ పడేశారు. వంశీ అరెస్టును ఖండించండి అని. అంతే.. తీరిక దొరికిన కొంత మంది వచ్చి ప్రెస్మీట్ పెట్టి కక్షపూరితంగా అరెస్టు చేశారని చెప్పి తమ దారిన తాము వెళ్లిపోయారు.
ఇదేనా వైసీపీ కోసం మొత్తం రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని రిస్కులో పెట్టుకున్న వ్యక్తికి ఇచ్చే సపోర్టు?.
వల్లభనేని వంశీ టీడీపీకి ఎందుకు టార్గెట్ అయ్యాడు..?. జగన్ రెడ్డికి మానసిక ఆనందం కలిగించడం కోసం.. ఆయన ప్రాపకం కోసం పార్టీ ఆఫీసు నుంచి వచ్చిన తిట్లను ఆయన మీడియా ముందు తిట్టారు. భువనేశ్వరి మీద ఆయన చేసిన వ్యాఖ్యల స్క్రిప్ట్ పట్టుకుని ఓ మహిళా విలేకరి ఆయన వద్దకు వచ్చి మైక్ పెట్టి మాట్లాడించుకుని ప్లే చేశారు. ఆ మాటలు ఆయన జీవితాన్ని తలకిందులు చేశాయి. టీవీలో కూర్చుని క్షమించండి అని వేడుకోవాల్సి వచ్చింది.
ఇంత చేసిన ఆయనకు వైసీపీ అధినేత జగన్ ఇచ్చే నైతిక మద్దతు ఇదేనా ? కనీసం లాయర్ గా పొన్నవోలును కూడా పంపలేదే ?
జగన్ రెడ్డికి ఓ సామాజికవర్గం మీద విపరీతమైన కసి. వారు తనను నమ్ముకుని నాశనమైనా ఆయనకు అదే ఆనందం అని వైసీపీలో గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. వంశీ విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే అదే నిజమని అనుకోక తప్పదేమో ?