హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించిన సెక్షన్ 8 అమలు చేస్తారన్న వార్తలపై తెలంగాణ భగ్గుమంది. రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ నాయకులైతే ఆగ్రహంతో ఊగిపోయారు. మరో ఉద్యమానికికూడా సిద్ధమని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసునుంచి తప్పించుకోటానికే సెక్షన్ 8 అంటూ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగసంఘాల మాజీ నాయకుడు, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డయితే ఢిల్లీనికూడా ముట్టడిస్తామని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి, వెంకటరమణారెడ్డి కూడా సెక్షన్ 8 అమలు సరికాదన్నారు. టీజేఏసీ కన్వీనర్ కోదండరామ్కూడా సెక్షన్ 8 పై స్పందించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలగలేదని అన్నారు. సెక్షన్ 8 అవసరంలేదని చెప్పారు. మరోవైపు టీన్యూస్ ఛానల్‌కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వటంపై తెలంగాణ జర్నలిస్టులు ఇవాళ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సెక్షన్ 8 అమలును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.