తెలంగాణ ప్రభుత్వానికి మేఘా రెండు వందల కోట్ల విరాళం ఇచ్చింది. నేరుగా కాదు. ప్రభుత్వం నిర్మించదల్చుకున్న స్కిల్ యూనివర్శిటీకి అవసరమైన భవనాలన్నీ మేఘా కంపెనీనే రూ. రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తుంది. ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వదు. అంచే విరాళంగా నిర్మించి ఇస్తుంది. తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఫండ్స్ నుంచి ఈ మొత్తం ఇస్తామని మేఘ కంపెనీ చెబుతోంది. నిబంధనల ప్రకారం కంపెనీలకు వచ్చే లాభాల్లో రెండు శాతం సీఎస్ఆర్ కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ వంద కోట్లు విరాళం ఇచ్చింది. ఈ స్కిల్ యూనివర్శిటీకి చైర్మన్ గా ఆనంద్ మహింద్రా బాధ్యతలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున నిధులు ఈ యూనివర్శిటీ కోసం వస్తున్నాయి. దీంతో పెద్దగాప్రభుత్వంపై భారం పడకుండా నిర్మాణం పూర్తవుతుందని అంచన వేస్తున్నారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీకి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా .. రాకుండా భారీ కార్పొరేట్ సంస్థలను నిర్వహణలో భాగం చేయాలని ప్రయత్నిస్తోంది.
స్కిల్ యూనివర్శిటీ ఆలోచన వచ్చిందే తడవుగా రేవంత్ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించేశారు. ముందుగా తాత్కలిక భవనాల్లో క్లాసులు కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయింది.