పదిహేనేళ్ల నాటి పబ్లిసిటీ వ్యవహారం ఇప్పుడు కోర్టు వరకూ వెళ్లింది. ఎలాగంటే… కండలు తిరిగిన హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ అంటే చాలా అమ్మాయిలతో మహా పిచ్చి. అతడంటే పడిచచ్చే వారు చాలా మందే ఉన్నారు. ఇక, ఆ సినిమా విడుదలైనప్పుడు చూడాలి, అతగాడి క్రేజ్. ఒక్క సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు. అప్పట్లో ఆ సినిమా క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి చాలా కంపెనీలు పోటీ పడ్డాయి.
కోకాకోలో కంపెనీ కూడా ఓ పోటీ పెట్టింది. అందులో గెలిచిన వారు హృతిక్ తో డేటింగ్ కు పంపిస్తామని ప్రకటించింది. దీంతో వేల మంది పోటీ పడ్డారు. హర్యానా పంచ్ కుల పట్టణానికి చెందిన శిఖా మోగే అప్పట్లో కాలేజీ విద్యార్థిని ఆమె కూడా ఆ పోటీలో పాల్గొంది. లక్కీగా విజేత అయింది. ఇది తెలిసి ఎగిరి గంతేసింది. డ్రీమ్ బాయ్ తో డేటింగ్ కు వెళ్తానని కాలేజీలో అందరికీ చెప్పుకొంది. ఆ రోజు కోసం ఎదురు చూసింది. కానీ కోకాకోలా వారు మాట నిలబెట్టుకోలేదు. కనీసం హృతిక్ ను కలవడానికి కూడా అనుమతించలేదు. దానికి బదులు ఓ 5 లక్షల నగదు బహుమతి ఇస్తామన్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు.
కాలం గడిచింది. ఇప్పుడు ఆమెకు 34 ఏళ్లు. ఆనాడు తనకు పరువు నష్టం కలిగిందంటూ శిఖా కోర్టుకు వెళ్లింది. పోటీలో గెలిచి డేటింగ్ కు వెళ్తున్నానని అందరికీ చెప్పుకున్నా, కానీ అలా జగకపోవడంతో పరువు పోయిందని వాదిస్తోంది. పరువుకు నష్టం కలిగించినందుకు కోకాకోలా కంపెనీ నుంచి తనకు 2.5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలంటూ దావా వేసింది. హర్యానాలో ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. విచారణ పూర్తయిన తర్వాత తీర్పు ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.