హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విషయంలో దొరికిన ఏ అవకాశాన్నీ కేసీఆర్ ప్రభుత్వం వదలటంలేదు. హైదరాబాద్ జుబ్లీహిల్స్‌లో బాబు తలపెట్టిన కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతిని అధికారులు నిరాకరించారు. సచివాలయానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించకపోవటంతోనే తన భవన నిర్మాణానికి అనుమతి లభించటంలేదని బాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. కొత్త ఇంటి నిర్మాణ అనుమతికోసం చంద్రబాబు తరపున జీహెచ్ఎమ్సీకి మే నెల మొదటివారంలో దరఖాస్తు సమర్పించారు. సాధారణంగా కొత్త ఇంటినిర్మాణ అనుమతికి ఒక నెల సమయం పడుతుంది. అయితే చంద్రబాబు దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటి వరకు కదల్చకపోవటం విశేషం. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్నితూర్పారబట్టారు. జీహెచ్ఎమ్సీ కమిషనర్ సోమేష్ కుమార్ అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమేష్ కుమార్ కేసీఆర్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు, నిబంధనలకు అనుగుణంగా లేకపోవటంవల్లే అనుమతిని ఇవ్వలేదని సోమేష్ కుమార్ చెప్పుకొచ్చారు. భవనం ప్లాన్, ఎత్తు, ఇతర విషయాలలో జీహెచ్ఎమ్సీ నిబంధనలకు అనుగుణంగా లేకపోవటంవల్లనే ఫైల్‌కు ఆమోదముద్ర వేయలేదని చెప్పారు. ఈ నిబంధనలకు అనుగుణంగా మళ్ళీ దరఖాస్తు చేస్తే తాము సమగ్రంగా పరిశీలించి అనుమతులు జారీ చేస్తామని అన్నారు. జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లో ఉన్న పాత నివాసం పెరిగిన కుటుంబ అవసరాలకు తగినట్లుగా లేకపోవటంతో దానిని పడగొట్టి అదేచోట కొత్త ఇంటి నిర్మాణాన్ని చంద్రబాబు ఇటీవల ప్రారంభించారు. బాబు ప్రస్తుతం తాత్కాలికంగా జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లో ఒక అద్దె ఇంటిలో ఉంటున్నారు.