రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీ కొత్త స్కూల్ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈ భవనాన్ని ఆయన తన సొంత ఖర్చులతో నిర్మించారు. కొదురుపాక కేటీఆర్ అమ్మమ్మ ఊరు. అందుకే అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థం అక్కడి భావిపౌరులకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో స్కూల్ నిర్మించాలని సంకల్పించారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన నిర్మాణం ఇప్పుడు పూర్తయింది. కేటీఆర్ స్వయంగా ప్రారంభించారు.
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఓ సారి కొదురుపాక గ్రామంలో పర్యటించారు. అమ్మమ్మ, తాతయ్యల ఊరు కావడంతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆ సమయంలో స్కూల్ దుస్థితిని టీచర్లు, పిల్లలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రిగా ఉన్నప్పటికీ… ప్రభుత్వం ద్వారా చేయించడం కన్నా.. సొంత ఖర్చుతో అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకంగా తానే బడిని నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అన్నట్లుగానే మొత్తం ఖర్చుతో పనులు పూర్తి చేయించారు.
2022 జనవరి 10న నిర్మాణం ప్రారంభించారు. రెండు ఫ్లోర్లలో 18 తగరతి గదులు కట్టారు. వంట గదితోపాటు డైనింగ్‌హాల్, కంప్యూటర్ గదులు, ప్రహరీ నిర్మించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇలా ప్రభుత్వ స్కూళ్లను సొంత నిధులతో నిర్మిస్తే.. స్మారక పేర్లను పెట్టుకోవచ్చు. ఈ స్కూల్ నిర్మాణానికి రూ. రెండు కోట్ల వరకూ ఖర్చు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.