విశ్వహిందు పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అశోక్ సింఘాల్ (89) ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు డిల్లీ సమీపంలోగల గుర్ గావ్ లోని మేదాంత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్నారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన మేదాంత ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కానీ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
అశోక్ సింఘాల్ అత్యున్నత విద్యావంతుడు. ఆయన 1950లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మెటలర్జికల్ ఇంజనీరింగు డిగ్రీ చేసారు. ప్రముఖ హిందుస్తానీ విద్వాంసుడు పండిట్ ఓంకార్ నాద్ వద్ద శిష్యరికం చేసి హిందుస్తానీ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. కానీ కాలేజీ చదివే రోజుల్లో నుండే ఆర్.ఎస్.ఎస్. సిద్దాంతాల పట్ల ఆకర్షితుడయ్యి అందులో కార్యకర్తగా పనిచేయడం మొదలుపెట్టారు. తన ఇంజనీరింగ్ విద్య ముగియగానే తన పూర్తి సమయం ఆర్.ఎస్.ఎస్.కే అంకితం చేసారు. ఆ తరువాత 1980లో విశ్వహిందు పరిషత్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత సుమారు 20 సం.లపాటు అశోక్ సింఘాల్ విశ్వహిందు పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా సేవలు అందించారు. 2011లో ఆరోగ్య కారణాలతో ఆయన తన బాధ్యతల నుండి వైదొలగడంతో ఆయన స్థానంలో ప్రవీణ్ తొగాడియా బాధ్యతలు చేపట్టారు.