పదమూడు జిల్లాలు వున్న ఆంధ్రప్రదేశ్ లో చాలినన్ని వర్షాలు లేక అదును అయిపోయే సరికి 7 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ వ్యవసాయమే మొదలు కాలేదు. మొత్తం సాగు విస్తీర్ణం 21 లక్షల హెక్టార్లు. 33 శాతం పంటపొలాలు బీడు భూములుగా వున్న ప్రభావం మొత్తం దిగుబడుల మీద వుండి భవిష్యత్తులో నూనెలు, పప్పులకు కొరత గట్టిగానే వుండే సూచనలు వున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
సగటు వర్షపాతంకంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉత్తరకోస్తాలో 15 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య కోస్తాలో 7 శాతం తక్కువగా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల దక్షిణ కోస్తాలో 39 శాతం తక్కువగా, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల రాయల సీమలో 42 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి.
ఎక్కడైనాగాని మెట్టవరి నాట్లు పూర్తయ్యాయి. నేల బాగా నానింది కాబట్టి ఉత్తరకోస్తాలో నూనెగింజలు, పప్పుధాన్యాలు పండించే రైతుల్లో 30 శాతం మంది ఈ సారి వరిసాగుకి మళ్ళిపోయారు.రాయలసీమలో వేరుశెనగ, నువ్వులు మొదలైన నూనెగింజల్ని పండించే 4 లక్షల హెక్టార్లూ బీడు భూములుగానే వుండిపోయాయి. మరో 3 లక్షల హెక్టార్లలో కందులు, మినుములు, పెసల వంటి పప్పుధాన్యాలు సాగే మొదలు కాలేదు. జూలై మొదటివారానికి విత్తనాలు చల్లేస్తారు. వర్షం పడటంలో ముందు వెనుకలను బట్టి మరో మూడువారాల వ్యవధిలో సాగు మొదలు పెడుతూనే వుంటారు. అదను పూర్తిగా అయిపోయింది కనుక ఇక ఈ సీజన్ కి 7లక్షల హెక్టార్లూ బీడుగా వుండిపోయినట్టేనని అధికారులు అంటున్నారు.