రాజధాని భూసేకరణ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఏవో ట్వీట్స్ చేయడం వాటికి మంత్రులు జవాబులు, సంజాయిషీలు చెప్పుకోవడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. తుళ్ళూరులో రాజధాని నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. తరువాత ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుండి రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరిస్తున్నప్పుడు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. భూసేకరణ కార్యక్రమం కొంతవరకు సాగిన తరువాత కొన్ని గ్రామాలలో రైతులు అభ్యంతరం చెప్పారు. మరికొందరు కోర్టుకి కూడా వెళ్ళారు. అప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న ఉండవల్లి, బేతపూడి, పెనుమాక గ్రామాలలో పర్యటించి వారి తరపున పోరాడుతానని హామీ ఇచ్చి హైదరాబాద్ చేరుకొన్నారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు పరిపాలనని మెచ్చుకొని ఆయనే మరో 20 ఏళ్లపాటు పరిపాలించాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పటి వరకు కనీసం ట్వీట్టర్ లో కూడా కనబడలేదు. రాజధాని భూముల గురించి మాట్లాడలేదు. కానీ భూసేకరణ కార్యక్రమం దాదాపు పూర్తి కావస్తున్న ఈ సమయంలో మళ్ళీ ట్వీటర్లో దాని గురించి చాలా మెసేజులు పెడుతూ ప్రజలకి, ప్రభుత్వానికి, మీడియాకి అందరికీ పనికల్పిస్తున్నారు.
రైతుల పట్ల ఆయనకి సానుభూతి, సారవంతమయిన భూములను కాపాడుకోవాలనే తపన ఉంటే మరి మొదటి నుండే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? మధ్యలో వచ్చినట్లే వచ్చి మళ్ళీ ఇన్నిరోజులు కనబడకుండా ఎందుకు మాయం అయిపోయారు. అప్పుడు ఎందుకు మౌనం వహించారు? మళ్ళీ ఈ ఆఖరి ఘట్టంలో వచ్చి ఎందుకు హడావుడి చేస్తున్నారు? అనే అనుమానాలు ఎవరికయినా కలగడం సహజం. వాటికి ఆయనే సరయిన జవాబు చెపితే బాగుంటుంది.
ఈ విషయంలో ప్రభుత్వం బాగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళమని ఆయన సూచిస్తున్నారు తప్ప ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలో సూచించలేకపొతున్నారు. అటువంటి అవకాశమే ఉంటే ఏ ప్రభుత్వమయినా దానికే మొగ్గు చూపుతుంది తప్ప రైతులను కష్టపెట్టాలనుకోదు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ఎన్ని చురకలు వేస్తున్నప్పటికీ మంత్రులు, తెదేపా నేతలు అందరూ చాలా సంయమనంగా మాట్లాడుతున్నారు. వీలయినంత వరకు రైతులను ఒప్పించే భూములు తీసుకొంటామని తప్పనిసరి పరిస్థితిలోనే భూసేకరణ చట్టం ద్వారా తీసుకొంటామని, రైతులకు నష్టం కలిగించమని చెపుతూనే ఉన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తన ట్వీట్ బాణాలు సందించడం మానలేదు. అప్పుడే ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ సమస్యకి పరిష్కారం చెప్పమని నిలదీసేసరికి పవన్ కళ్యాణ్ హర్ట్ అయినట్లున్నారు. అందుకే త్వరలో ఆ గ్రామాలలో పర్యటించి రైతులను కలుస్తానని ప్రకటించారు.
తెదేపా ఆయనని తమ మిత్రుడుగా భావిస్తోంది. ఆయన కూడా తెదేపాని మిత్రపక్షంగానే భావిస్తున్నట్లయితే ఈ సమస్య గురించి ఈవిధంగా ట్వీటర్లోనో లేక తుళ్ళూరుకి వెళ్లి హడావుడి చేసో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే బదులు ఆయన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తన అభిప్రాయలు, ఆలోచనలు, సున్నితమయిన ఈ సమస్యకు పరిష్కారాల గురించి చర్చించి ఉండి ఉంటే బాగుండేది. కానీ ఈవిధంగా ప్రభుత్వంపై ట్వీట్ బాణాలు సందించడం వాటికి మంత్రులు సంజాయిషీలు చెప్పుకొనేలా చేయడం, చేయకపోతే ఆ గ్రామాలకి వెళ్లి రైతులతో కలిసి ఉద్యమిస్తానని సూచించడం ఆయనకి శోభనీయవు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు అనేక అవాంతరాలు ఎదురయినా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆచితూచి ముందుకు అడుగులు వేస్తోంది. అందుకే రాజధాని ప్రాంతంలో చాలా మంది రైతులు తమ భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించారు.
రైతులకు భూమితో ఉన్న అనుబంధాన్ని ఎవరూ వెలకట్టలేరు. భూమితో ముడిపడున్న ఆ అనుబంధం, కుటుంబ అవసరాలు వంటి అనేక ఇతర కారణాల చేత కొందరు రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. కానీ వారి నుండి భూమి తీసుకొంటే తప్ప రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చట్టం ద్వారా వారి నుండి భూమి తీసుకోవాలని నిర్ణయించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో తెదేపాకి మిత్రుడుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సమస్యను అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారం కోసం రైతులకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తే అందరూ హర్షిస్తారు. కానీ అవరోధంగా నిలిస్తే విమర్శలు ఎదుర్కోక తప్పదని గ్రహించాలి.
ఇంతవరకు వచ్చిన తరువాత ఇక వెనక్కి వెళ్ళే పరిస్థితే ఉండదు. ఒకవేళ అటువంటి పరిస్థితిని ఆయన కల్పించాలనుకొంటే దాని వలన రాజధాని నిర్మాణం మొదలవదు. ఇప్పటికే ఏడాదిన్నర సమయం గడిచిపోయింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం కూడా సహాయం చేసేందుకు సిద్దంగా ఉంది. ఇటువంటి అనుకూలమయిన రాజకీయ పరిస్థితులు ఎల్లకాలం ఉంటాయని అనుకొంటే అది భ్రమే. కనుక అన్ని విధాల అనుకూలంగా ఉన్న ఈ సమయంలోనే వీలయినంత వేగంగా రాజధానిని నిర్మించుకోవాలి. అందుకు పవన్ కళ్యాణ్ తో సహా అందరూ సహకరించాలి. కానీ అడ్డంకులు సృష్టిస్తే చివరికి నష్టపోయేది రాష్ట్రం, రాష్ట్ర ప్రజలే. అప్పుడు ప్రజలు కూడా ఆయనని విమర్శించవచ్చు లేదా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంటుంది. కనుక వీలయితే ఈ సమస్యకి పరిష్కారం చూపాలి. లేకుంటే ఈ సమస్యని ప్రభుత్వానికే వదిలిపెట్టేయాలి. ఇంతకంటే వేరే మార్గం కనబడటం లేదు.