హైదరాబాద్: మొన్న హైదరాబాద్‌లో ట్రయల్ రన్ చేస్తానంటూ షోరూమ్లోనుంచి రు.6 లక్షల ఖరీదుచేసే క్రూజర్ బైక్ ‘హార్లీ డేవిడ్సన్’తో ఒక వ్యక్తి ఉడాయించిన వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ బైక్ దొంగ ఎట్టకేలకు దొరికాడు. పోలీసులు అతనిని ఇవాళ ముంబాయిలో అరెస్ట్ చేశారు. భీమవరంవాసిగా అతనిని గుర్తించారు. అతను ఓఎన్జీసీలో సబ్‌మెరైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. హైదరాబాద్ పోలీసులు ఇవాళో, రేపో అతనిని మీడియాముందు ప్రవేశపెట్టనున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఉన్న హార్లీ డేవిడ్సన్ షోరూమ్‌లో ఈ దొంగతనం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. అత్యాధునికమైన మోడల్ బైక్‌ను చూడటానికి ఒక యువకుడు వచ్చాడు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అన్నీ చూపించి సిబ్బందిని నమ్మించాడు. బండి తీసుకుని వెళ్ళాడు. ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడని షోరూమ్ సిబ్బంది ఎదురుచూడటమేగానీ అతను రాలేదు. దానితో వారు సాయంత్రం 4.30 ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో దొంగ ఆఖరుగా మెదక్ జిల్లా సదాశివపేటలో ఒక పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకున్నాడని తేలింది. అది ముంబాయి రూట్ కాబట్టి దొంగ ముంబాయి వెళ్ళి ఉంటాడని పోలీసులు నిన్నే అనుమానించారు. వెంటనే ముంబాయి వెళ్ళి దొంగను పట్టుకోగలిగారు. దానికితోడు ఆ షోరూమ్ ప్రముఖ రాజకీయ నాయకుడిది కాబట్టి మరికొంత వేగంగా పని చేసినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ఈ షోరూమ్ యజమాని. ఆయనకు నగరంలో హ్యూండాయ్, నిస్సాన్ ఆటో మొబైల్ కంపెనీలతోపాటు హార్లే డేవిడ్సన్ డీలర్షిప్కూడా ఉంది.