బంపర్ ఆఫర్ అనే మాట సరిపోదు. కళ్లు తిరిగే ప్యాకేజీతో బీహారీలకు థ్రిల్లింగ్ ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. వాళ్లు ఊహించింది 50 వేల కోట్లు. మోడీ ప్రకటించింది లక్షా 25 వేల కోట్లు. దాంతో పాటు పాత బాకీల పేరిట మరో 40 వేల కోట్లు. డబుల్ ధమాకా. ఏపీ రాజధానికి, ఇతర ప్రాజెక్టులకు నిధులు అడిగితే బడ్జెట్ లోటని ఇంకోటని సాకులు చెప్తుంది కేంద్రం.
ఇక ప్రత్యేక రాష్ట్ర హోదా విషయానికి వస్తే అనేక సాంకేతిక కారణాలను చెప్తోంది. హోదా మీరే ఉంచుకోండి, మాకు బీహార్ లా ప్యాకేజీ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగాల్సిన సమయమిది. ఒకటి రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి బీహార్ కు ఎవరూ ఊహించనంత పెద్ద మొత్తాన్ని స్పెషల్ ప్యాకేజీగా ప్రకటించారు. దానికి ఎలాంటి సాంకేతిక అంశాలూ అడ్డు రాలేదు. కాబట్టి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి కూడా ఏ సాంకేతిక ఆటంకాలూ ఉండకూడదు. కొత్త రాష్ట్రాన్ని ఆదుకుంటామని విభజన చట్టంలోనే ఉంది కాబట్టి ఏ విధంగానూ ఆటంకాలు లేవు.
ఏపీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ప్యాకేజీ రాబట్టాల్సిన సమయమిది. తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు నెలల వరకూ ఎన్నికలు జరగవు. అందుకే ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం అడుగడుగునా చిన్న చూపు చూస్తున్నదా అనే అనుమానం కలుగుతోంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలి. పోలవరం నిర్మాణానికి పూర్తిగా నిధులు సమకూర్చాలి. లోటు బడ్జెట్ భారం తగ్గించాలి. అన్ని విధాలుగా రాష్ట్రం నిలదొక్కుకోవడానికి చేయాల్సింది అంతా చెయ్యాలి. విభజన చట్టంలో ఉన్నది ఇదే. అంతేతప్ప, ఇదేమీ కేంద్రం దయతో చేసేది కాదు.
ఏపీలో ఎన్నికలు వస్తేనే ప్యాకేజీ ఇస్తామనే ధోరణిలో కేంద్రం ఉంటే గనక రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా కౌంటర్ ఇవ్వక తప్పదు. విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సభ్యులు ఎంత ఇదిగా ఏపీ తరఫున పార్లమెంటులో వాదించారనేది మరోసారి ప్రధానికి గుర్తు చెయ్యాలి. మిత్ర పక్షమైనా సరే, కేంద్ర కేబినెట్లో భాగస్వామి అయినా సరే, జంతర్ మంతర్ వద్ద టెంటు వేసి కూర్చొని అయినా ప్రత్యేక ప్యాకేజీ సాధించేలా చంద్రబాబు సర్కార్ సంకల్పించాలనేది ఏపీ ప్రజల ఆకాంక్ష. బీహార్ కు అంత భారీ ప్యాకేజీ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే ఏపీ స్పందించి గట్టిగా పట్టుబట్టకపోతే, మంచి అవకాశం చేజార్చుకున్నట్టు అవుతుంది. వేడిమీదనే ఏదైనా చెయ్యాలి. వేడి తగ్గినా, రోజులు గడిచినా సీన్ మారిపోవచ్చు.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏమిటనేది చంద్రబాబు సర్కార్ ఆలోచించాలి. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాం, ప్యాకేజీ ఇస్తారా అని ప్రధానిని ప్రశ్నిస్తే జవాబు ఏమిటో చూడాలి.