ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి, తెలంగాణాలో హైదరాబాద్, వరంగల్ నగరాలతో సహా దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చెయ్యడానికి కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అవసరాలకు సరిపడా నీటిసరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంటుతో సహా పారిశుధ్యం, ప్రజారవాణాతో సహా సమర్థవంతమైన రవాణా సదుపాయాలు, భరించగలిగిన ధరలలో, ముఖ్యంగా పేదవారికి గృహ సదుపాయం, బలమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటలైజేషన్, సుపరిపాలన ముఖ్యంగా ఈ-గవర్నెన్స్- ప్రజల భాగస్వామ్యం, మంచి పర్యావరణం, పౌరులకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు రక్షణ, విద్య, వైద్యం… మొదలైన 10 ప్రధాన అంశాలు స్మార్ట్ సిటీల్లో వుంటాయని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఇవన్నీ స్ధానిక స్వపరిపాలనా నిధులతోనో, రాష్ట్ర ప్రభుత్వనిధులతోనో, కేంధ్రప్రభుత్వ నిధులతోనో ఏదో ఒక స్ధాయిలో అమలవుతూనే వున్నాయి.
నీటి సరఫరాకు స్మార్ట్ నీటి మీటర్లు బిగించటం, లీకేజీలను అరికట్టడం, నీటి నాణ్యతను పరిశీలించటం, అలాగే పారిశుద్ధ్యం కోసం చెత్త నుంచి విద్యుత్ తయారీ, చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చటం, మరుగునీటిని శుద్ధి చేయటం వంటి స్మార్ట్ పరిష్కారాలు ప్రభుత్వాలు చెబుతున్న పాత పరిష్కారాలే తప్ప కొత్తవేమీకాదు.
వీటిని అమలు చేయడానికి ఏర్పడే ఒక ప్రత్యేక వ్యవస్ధ ఏర్పడటమే ‘స్మార్ట్’ విధానం. దేశవ్యాప్తంగా ఈపనిచేసే యంతా్రంగం పేరు ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’. ఇది ప్రతీ స్మార్ట్ సిటిలో ఒక రిజిష్టర్డ్ కంపెనీని ఏర్పాటు చేస్తుంది. ఆకంపెనీ ప్రారంభంలో మున్సిపల్ కార్పొరేషన్ కు 50 శాతం, రాష్ట్రప్రభుత్వానికి 50 శాతం వాటాలు వుంటాయి. తరువాత రాష్ట్రప్రభుత్వం తన వాటాల్లో 40శాతం వాటాలను ఎవరికైనా విక్రయించుకోవచ్చు. భారీపెట్టుబడులు పెట్టగల కార్పొరేట్లే ఈ వాటాలను కొనడానికే ఈ ఏర్పాటని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.ఆకంపెనీల్లో విదేశీ పెట్టుబడులుకూడా వుండవచ్చు కంపెనీల్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచికొందరు, ‘బయటివారు’ కొందరు డైరక్టర్లుగా వుంటారు. ఒక సిఇఒ పర్యవేక్షణలో కంపెనీ పనిచేస్తుంది.
స్పెషల్ పర్పస్ వెహికిల్ ను నడపడానికి సిఇఒ సారధ్యంలో జాతీయస్ధాయిలో 8 మందితో బోర్డు వుంటుంది. ప్రజలనుంచి ఎన్నికైన వారికి ఈ బోర్డుల్లో చోటుండదు. బోర్డు సమావేశాలకు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులను, ప్రపంచబ్యాంకు, టిఇఆర్ఐ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్మార్ట్ సిటీస్‌కు చెందిన ప్రతినిధులను ఆహ్వానించవచ్చు. అలాగే ద్వైపాక్షిక, బహుళ పక్ష ఒప్పందాలను కుదుర్చుకున్న వారి ప్రతినిధులను, పట్టణ ప్రణాళిక నిపుణులను పిలువవచ్చు. ఈ పద్ధతిలోనే రాషా్ట్రలకు కూడా బోర్డులు వుంటాయి. నగరాల్లో జరిగే ఈ పనులన్నింటికీ సంబంధించి ప్లానింగ్, మదింపు, ఆమోదం, నిధులు విడుదలచేయటం, అమలు జరపటం, నిర్వహించటం లాంటి సర్వాధికారాలూ ఈ కంపెనీకే ఆయా నగరాలవారీగా వుంటాయి.
కంపెనీకి కేంద్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.194 కోట్లు, తరువాత మూడు సంవత్సరాలు రూ.98 కోట్ల చొప్పున ఇస్తుంది.అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, దానికి మ్యాచింగ్‌గా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చేది ప్రాజెక్టు ఖర్చులో కొద్ది భాగం మాత్రమే నని గైడ్ లైన్స్‌లోనే స్పష్టం చేశారు. ఇది కంపెనీకి కార్పస్ ఫండ్ మాత్రమే.
ప్రాజెక్టు ఖర్చును యూజర్ ఛార్జీలు, లబ్ధిదారుల ఛార్జీలు, ఇంపాక్టు ఫీజులు, భూ వినియోగం, అప్పులు చేయటం, లోన్లు, తదితర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలి. 14వ ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చే డబ్బును వాడుకోవాలి. మున్సిపల్ బాండ్లను విడుదలచేయటం, పన్నుల నిరంతర పెంపుదల వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా సమకూర్చుకోవాలి. అంటే స్మార్ట్ సిటీకి అయ్యే ఖర్చు మొత్తం వివిధ రూపాలలో ప్రజలు చెల్లించాల్సిందే.
స్మార్ట్ సిటీని ఆమోదిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా నశిస్తుంది. నగరపాలన కంపెనీ పాలనగా మారుతుంది. నగరంలో జరిగే పనులకు అయ్యే ఖర్చును, కంపెనీలో వాటాదారుల లాభాలను పూర్తిగా నగర ప్రజలే భరించవలసి వస్తుంది. ఈ పథకంలో చేరితే ఇక మీదట నగరానికి రూపాయి రాదు. ప్రతి పనీ నగర ప్రజలు డబ్బులిచ్చి చేయించుకోవలసిందే. చివరకు నగర పాలనే అస్తవ్యప్తంగా మారుతుంది. నగర ప్రజలు ప్రజాతంత్ర హక్కులను కోల్పోతారు. కంపెనీల పాలన మొదలవుతుంది.
సూటిగా చెప్పాలంటే స్మార్ట్ సిటి అంటే స్ధానిక స్వపరిపాలనను కోల్పోవడమే…కార్పొరేట్లకు అధికారాలు అప్పగించడమే… కంపెనీల లాభాల్ని కూడా యూజర్ చార్జీలుగా భరించడమే!