హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్య వ్యవహారం జరిగినా పవన్ కళ్యాణ్ స్పందించాలనే డిమాండ్ ఇటీవల తరచూ వినిపిస్తోంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై పవన్ స్పందించాలని పలువురు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓటుకు నోటు వ్యవహారంలో కూడా అదేవిధమైన డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ విషయంలో పవన్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నవారి జాబితాలో మొన్న టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్, నిన్న రామ్గోపాల్ వర్మ ఉండగా ఇవాళ రాజ్యసభ ఎంపీ వి.హనుమంతరావు చేరారు. ఎక్కడ తప్పులు జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని వీహెచ్ ప్రశ్నించారు. మౌనంవీడి చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలమీద స్పందించాలని డిమాండ్ చేశారు.