రాజకీయ నేతలు ప్రజల దృష్టిని ఆకర్షిచేందుకు ఎంతకయినా తెగిస్తారని ఏపీ కాంగ్రెస్ నేతలు మరొక్కమారు రుజువు చేసారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకొన్న మునికోటికి సోమవారం తిరుపతిలో అంత్యక్రియలకు చిరంజీవి, సి. రామచంద్రయ్య, ఆనం రామనారాయణ రెడ్డి, సిపిఐ, తెదేపా నేతలు హాజరయ్యారు. చనిపోయిన మునికోటికి అందరూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. బాగానే ఉంది. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అందరూ చెప్పారు. అది కూడా బాగానే ఉంది. కానీ చనిపోయిన మునికోటి పాడి మోయడానికి అందరూ పోటీలు పడటమే చాలా చిరాకు కలిగిస్తుంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మరి కొందరు నేతలు మునికోటి పాడె మోశారు. అదే కొంచెం అతిగా ఉంది.
మునికోటి ఇంత అకస్మాతుగా ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యలు చాలా షాక్ కి గురయ్యి ఉన్నారు. ఇక చేసేదేమీ లేదు కనుక అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసుకోవాలనుకొంటే రాజకీయ నాయకులు మధ్యలో దూరి వారి చేతిలో నుండి పాడి తీసుకొని మోస్తూ చాలా అనవసరమయిన (ఓవర్) యాక్షన్ చేసారు. వారందరికీ నిజంగానే అతని మీద పరిచయమో, అభిమానమో, సానుభూతో ఉండి ఉంటే వారు ఆవిధంగా చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పి ఉండేవారు కాదు. కానీ వారిలో చాలా మంది మునికోటిని ఎన్నడూ చూడలేదు కూడా. పైగా అతను తమ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకొంటే అతనిని ఆసుపత్రికి తరలించి తమ సభను కొనసాగించి ఆనక తాపీగా ఆసుపత్రికి వెళ్లి చూసి వచ్చారు తప్ప తమ సభను రద్దు చేసుకోవాలనుకోలేదు. అతను ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంటే, అతని ఆత్మహత్యకు నరేంద్ర మోడీ, చంద్రబాబే కారణమని కాంగ్రెస్ నేతలందరూ నిందిస్తూ తెదేపా, బీజేపీలమీద విమర్శలు గుప్పించారు. కనుక మునికోటి మీద వారికి ప్రేమ పొంగి పొరలిపోతోందనుకోలేము. ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటాన్ని మరింత హైలైట్ చేసేందుకే వారు అంత ఓవర్ యాక్షన్ చేసారని భావించవలసి ఉంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఆప్పుల బాధలు భరించలేక నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. కానీ వారి కుటుంబాలను ఎవరూ ఈవిధంగా పట్టించుకోరు. సానుభూతి చూపరు. డిల్లీ నుండి రాహుల్ గాంధీ వంటివారు వచ్చినప్పుడు మాత్రం ఆ చితికిపోయిన కుటుంబాలలో ఎంపిక చేసిన వారిళ్ళ మీదకి కాంగ్రెస్ నేతలు ఇలాగే దండయాత్రకి వెళ్ళినట్లు వందల మంది వెళ్లి ఓదార్చి వస్తుంటారు. రాజకీయాలలో వీటినే శవ రాజకీయాలంటారు.