ఆంగ్లేయుల కుట్రపూరిత పాలనలో భారతీయులను గుమస్తాలుగా తయారు చేసే విద్యా విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకరి చేతికింద అనుచరులుగా ఉండటమే కాదు, మహా సామ్రాజ్యాల్లాంటి అమెరికా కంపెనీలకు సారథులం కాగలమని భారతీయులు నిరూపిస్తున్నారు. భారతీయలు సత్తాకు తాజా ఉదాహరణ, సుందర్ పిచాయ్. ఈ చెన్నై ముద్దుబిడ్డ ఇప్పుడు గూగుల్ అనే అతి పెద్ద కంపెనీకి సి ఇ ఒ. గూగుల్ లో టాప్ ఎగ్జిక్యూటివ్ గా చేరడమే గొప్ప అనుకుంటే ఏకంగా ఆ సంస్థకే సారథి కావడం ఆశ్చర్యం కలిగించినా, అతడి సత్తాను తెలిసిన వారికి మాత్రం ఇది సముచిత నిర్ణయమే అనిపిస్తుంది.
కొత్త మాతృసంస్థ అల్ఫాబెట్ లో గూగుల్ కీలక సబ్సిడరీగా ఉంటుంది. ఇక నుంచి కంపెనీ కార్యకలాపాలన్నీ అల్ఫాబెట్ ద్వారానే జరుగుతాయి. ఈ కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు సుందర్ పిచాయ్ మీద ఉంది. ఐఐటీ ఖరగ్ పూర్ లో ఇంజిరీరింగ్ చదివిన సుందర్, ఆ తర్వాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, వార్టన్ స్కూల్లో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు. గూగుల్ లో ప్రాడక్ట్ మేనేజిమెంట్, నవీన ఉత్పత్తుల పర్యవేక్షణ విభాగంలో అతడు చూపిన చొరవ, దూకుడు కారణంగా యాజమాన్యం దృష్టిలో పడ్డారు. కంపెనీని సమర్థంగా ముందుకు తీసుకుపోగలడనే నమ్మకం కలగడం వల్లే గూగుల్ వ్యవస్థాపకుడు సుందర్ కు సంస్థ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు.
ఏ దేశమేగినా ప్రతిభను చాటుతున్న ప్రవాస భారతీయులు, అమెరికాలో చెరగని ముద్ర వేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పెక్సికో సి ఇ ఒ గా కంపెనీని లాభాల బాటలో నడుపుతున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో మహిళా సి ఇ ఒలు చాలా అరుదు. అలాంటిది ఓ ఇండియన్ అమెరికన్ అంత ఉన్నత స్థాయికి చేరడం గొప్ప విషయం. సాఫ్ట్ వేర్ ప్రపంచంలో రారాజు వంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ సారథి సత్య నాదెళ్ల ప్రతిభ అమోఘమని స్వయంగా బిల్ గేట్స్ మెచ్చుకున్నారు. ప్రపంచానికి కంప్యూటర్ ను చేరువ చేసిన మైక్రోసాఫ్ట్ ను ముందుకు నడపడం అంటే మాటలు కాదు. ఎంతో గొప్ప ఆలోచన శక్తి, మేనేజిమెంట్ సామర్థ్యం, వ్యూహ చతురత, మానవ వనరులను సమర్థంగా ఉపయోగించుకునే సత్తా, కొత్తగా ఆలోచించడం వంటి అనేక గొప్ప లక్షణాలుండాలి. ఇవన్నీ ఆయనలో ఉన్నాయని బిల్ గేట్స్ నమ్మారు కాబట్టే అంత పెద్ద కంపెనీ బాధ్యతలను సత్య నాదెళ్ల చేతిలో పెట్టారు.
అంతేకాదు, సిటీ గ్రూప్ సి ఇ ఒ స్థాయికి చేరిన విక్రం పండిత్ కూడా భారతీయుల ప్రతిభకు మరో ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల ఉనికే కాదు, వారి ప్రతిభా పాటవాల వ్యాప్తి కూడా పెరుగుతోంది. పెద్ద పెద్ద కంపెనీల్లో భారతీయులు సత్తాను చాటుతున్నారు. కంపెనీలకు లాభాలు పెంచడమే కాదు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు. స్వదేశంలోని యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఏదైనా సాధించడానికి ప్రయత్నించాలనే ప్రేరణ కలిగిస్తున్నారు. గూగుల్ వంటి కంపెనీకి భారతీయుడు సారథి అయ్యాడనే వార్త, నిజంగా నేటి యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయం. బట్టీపట్టి చదవడం కాదు, సృజనాత్మకంగా ఆలోచించడం, విశ్లేషణాత్మక శక్తిని అలవాటు చేసుకోవడం వల్ల ఉద్యోగంలో శిఖరాగ్రానికి చేరవచ్చనడానికి సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇంద్రా నూయి వంటి వారే గొప్ప ఉదాహరణ.