ఇండియన్ సినిమా స్కేల్ మార్చిన దర్శకుల్లో శంకర్ ముందు వరుసలో ఉంటాడు. అయితే ఈమధ్య ఆయనకు టైమ్ కలసిరావడం లేదు. ‘భారతీయడు 2’ డిజాస్టర్ అయ్యింది. గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యమైంది. అంతకు ముందు కూడా ఆర్థికంగా శంకర్‌కు కొన్ని తలనొప్పులు ఎదురయ్యాయి. డిసెంబరు 20న గేమ్ ఛేంజర్ వస్తోంది. ఆ తరవాత.. ‘భారతీయుడు 3’ని విడుదల చేస్తారు. ఈ సినిమాల తరవాత ఏం చేయాలన్న విషయంలో శంకర్ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి ఆయన ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సూర్య, విక్రమ్‌లతో శంకర్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నారని, ఈ సినిమా ఏకంగా 3 భాగాలుగా రానుందని తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి. తమిళనాట ప్రాచూర్యం పొందిన ‘వేల్పారి’ అనే నవల ఈ కథకు ఆధారమని తెలుస్తోంది. 3 భాగాలూ కలిసి రూ.1000 కోట్లకు పైగానే అవుతుందట. మూడు భాగాల్నీ ఒకేసారి షూట్ చేసి, రెండు నెలల వ్యవధితో విడుదల చేయాలన్నది ఒక ప్లాన్.
అయితే ఇంత భారీ ప్రాజెక్ట్ చేయడానికి నిర్మాతలు ముందుకు రావాలంటే… శంకర్‌కు ఓ మంచి హిట్ కావాలి. అది ‘గేమ్ ఛేంజర్’ రూపంలో దక్కాలి. ‘భారతీయుడు 2’తో శంకర్ నిర్మాతలు భారీగా నష్టపోయారు. తను ఫామ్ లో లేడన్న విషయం ఆ సినిమాతో అర్థమైపోయింది. పైగా ఎప్పుడూ లేనంతగా శంకర్ ఈ సినిమాకు ట్రోల్ అయ్యాడు. అయితే ఇప్పటికీ నిరాశ పడాల్సిన పని లేదు. శంకర్ చేతిలో ‘గేమ్ ఛేంజర్’ వుంది. ఆర్.ఆర్.ఆర్తో రామ్ చరణ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తన ఫామ్ ఈ సినిమాకు కలిసొస్తే శంకర్ గట్టెక్కేసినట్టే. గేమ్ ఛేంజర్ గనుక హిట్ అయితే, శంకర్ కలల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి ఎలాంటి ఆటంకాలూ ఉండవు. కానీ రిజల్ట్ తేడాగా వస్తే మాత్రం ‘వేల్పారి’ నవల తెరపైకి రావడానికి ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.