మనది ధనిక రాష్ట్రం. గుజరాత్ తర్వాత మనమే సంపన్నుల అని తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే చెప్తుంటారు. డబ్బు విషయంలో గుజరాత్ తర్వాత మనమే అంటున్న కేసీఆర్, మద్యం విషయంలో మాత్రం గుజరాత్ పేరే ఎత్తరు. అక్కడ సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉందనే సంగతి ఆయనకు తెలుసో లేదో ఆయనే చెప్పాలి.
నిజమే. తెలంగాణ ధనిక రాష్ట్రమే. అది ఈ రాష్ట్ర గొప్పతనం. అలాంటప్పుడు, సంపూర్ణ మద్య నిషేధం కాకపోయినా, వీలైనంత వరకూ మద్యం విక్రయాలను పరిమితం చేసి ప్రజారోగ్యాన్ని కాపాడేలా విధానాలు తయారు చేయాలి. వీలైనన్ని తక్కువ వైన్ షాపులు, బార్లు ఉంటే ఎక్కువ మందికి అది అందుబాటులో ఉండదు. బెల్ట్ షాపులను కట్టడి చేస్తే భర్తల తాగుడు, వాగుడు, గొడవ చెయ్యడం నుంచి మహిళలకు విముక్తి లభిస్తుంది. కేసీఆర్ ఈ దిశగా చర్య తీసుకుంటే తెలంగాణ ఆడపడుచులు జేజేలు పలికే వారు. కానీ సారాకు బదులు సర్కారీ సారాను చీప్ లిక్కర్ పేరుతో అందుబాటులోకి తేవాలనే నిర్ణయం మహిళలకు ఆగ్రహం కలిగించింది.
తాగితాగి ఒళ్లు గుల్ల చేసుకుంటే మొట్టమొదటి బాధిత వ్యక్తి ఎవరంటే అతడి భార్య. సేవలు చేయాలన్నా, చికిత్సకోసం కష్టపడాలన్నా ఖర్చు పెట్టాలన్నా భార్యమీదే భారం. అందుకే, మద్యం మహమ్మారి వద్దని మహిళలు ఆక్రోశిస్తుంటారు. కానీ ఆదాయం కావాలి కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకోవు. ఇప్పుడు మనది సంపన్న రాష్ట్రం. డబ్బులకు లోటు లేదు. మద్యం మీద ఆదాయమే రావాలనే బాధ లేదు. అందుకే రకరకాల పథకాలకు కేసీఆర్ వేల కోట్లు, లక్షల కోట్లు ప్రకటిస్తూ పోతున్నారు. అలాంటప్పుడు చీప్ లిక్కర్ మీద వచ్చే ఆదాయం కోసం ప్రభుత్వం కక్కుర్తి పడటం ఎందుకు?
సారాను అరికట్టలేకపోవడం ఎక్సయిజ్ శాఖ చేతగానితనం. కాబట్టి వారు సరిగా పనిచేస్తారా లేక కొత్తవారిని నియమించమంటారా అని దబాయించి సక్రమంగా పనిచేయించడం ప్రభుత్వ విధి. ప్రజారోగ్యం కోసం పనిచేసే ప్రభుత్వం ఆబ్కారీ శాఖచేత సరిగా పనిచేయించ లేకపోవడం కూడా అసమర్థతే. అలా కాకుండా, సారాను అరికట్టలేరు కాబట్టి సర్కారీ సారా తెస్తామనడం దారుణం.
పోలీసులు చోరీలను, రేపులను అరికట్టలేకపోతున్నారు కాబట్టి వాటిని చట్టబద్ధం చేసేస్తారా? తక్కువ మొత్తంలో చోరీ చేస్తే కేసు మాఫీ అని ప్రకటిస్తారా? చేతగానితనాన్ని సమర్థించే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. ధనిక రాష్ట్రం అని చెప్పుకోవడమే కాదు, గుజరాత్ లో అమల్లో ఉన్న మద్యనిషేధం గురించి కూడా చెప్పాలి. అక్కడ చాలా వరకు మద్య నిషేధం సమర్థంగా అమలవుతోంది. మనం ఆ దిశగా ప్రయత్నం చేయలేమా? నిషేధం సంగతి తర్వాత, ముందు చీప్ లెక్కలు, చీప్ లిక్కర్ బాగోతాలు ఆపితే మన జన్మ ధన్యమైనట్టే.