పెట్రోల్, డీజిల్ రేటు అనగానే పెరగటమే తప్పా తగ్గటం ఉండదు. ట్యాక్సుల మీద ట్యాక్సులు వేసి… రేట్లు పెంచి, సగటు వేతన జీవి నడ్డి విరుస్తున్నారు అని ఎంత మంది మొత్తుకున్న రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కానీ, కీలకమైన ఎన్నికలు వస్తే మాత్రం రేటు పెరగకుండా ఆగటమో, తగ్గటమో జరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ పాత కథే.
అంతర్జాతీయంగా రేట్లు పెరగ్గానే రేటు పెంచే ఆయిల్ కంపెనీలు… తగ్గినప్పుడు మాత్రం తగ్గించట్లేదు. దాదాపు నెల రోజులుగా చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గుతూనే ఉన్నాయి. బ్యారెల్ ధర గతేడాది 84డాలర్లుగా ఉండగా, సెప్టెంబర్ లో 73డాలర్లుగా ఉంది. అయినా, రిటైల్ రేట్లు మాత్రం కంపెనీలు తగ్గించలేదు. ప్రభుత్వాలు కూడా ఫోకస్ చేయలేదు.
అయితే, కొంతకాలంగా తమ నష్టాలను పూడ్చుకుంటూ వచ్చిన ఆయిల్ కంపెనీలు… ఇక వినియోగదారులపై కూడా భారాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. పెట్రోల్, డీజిల్ పై 2-3రూపాయల వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉందని ప్రకటించింది.
2021 నుండి అంతర్జాతీయ ముడి చమురు రేట్లు పెరిగితే… రిటైల్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ఇచ్చింది. తగ్గినప్పుడు మాత్రం కంపెనీలు తగ్గించటం లేదు. దీనిపై కేంద్రప్రభుత్వమే చొరవ తీసుకోవాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి.