నంద్యాల ఊరించి..ఊరించి..రెచ్చగొట్టి..రక్తం మరిగిపోయేలా చేసిన ఉప ఎన్నికలో ఓటరు తీర్పు చాలా స్పష్టంగానే ఉంది. సీటు మనదే అనే ధీమాలో విచక్షణ మరిచి చేసిన వ్యాఖ్యలను వారు తమ వజ్రాయుధంతో తిప్పికొట్టారు. నడిరోడ్డుపై కాల్చాలి…చెప్పులతో కొట్టాలి అనేటటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజంలో బహిరంగంగా చేయాల్సినవి కావు. ఆఖరుకు శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ పదవీ పోయింది. ఇప్పుడు ఈ సోదరులిద్దరూ ఏం చేస్తారనేది ప్రశ్నార్థకం. అనుభవం లేని యువతే కదా అనుకున్నారు.. మన సీటే కదా అనీ భరోసాగా ఉన్నారు. ఇలాగని రెండు పార్టీలూ తెరచాటు ప్రయత్నాలను చేసుకున్నారు. ప్రధానంగా వైయస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ టీడీపీపై బురద జల్లడానికి ఏ అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వీడియోలను విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. నిక్కర్లు విప్పి చూపిస్తాం.. నుంచి గుండు కొట్టించుకోవడం వరకూ వెళ్ళాయి ఆయా పార్టీ వ్యాఖ్యలు. మాటల యుద్ధంతో ఓటరు మనసు గెలవలేరని మరోసారి రుజువైంది. ఏ ఎన్నికల్లోనూ చేయనంత డబ్బు ఖర్చుచేశారు. ఏ ఎన్నికల్లోనూ లేని మాదిరిగా ప్రముఖులంతా నంద్యాల బాట పట్టారు. ఎవరి పని వారు చేశారు. కానీ వైసిపి మాత్రం ప్రశాంత్ కిషోర్ ఇచ్చే సమాచారం మీద.. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రచారం పైనా మాత్రమే ఆధారపడింది. అందుకు తగిన మూల్యాన్ని చవి చూసింది.
ఇప్పుడు ఇక్కడ అభ్యర్థి ఎవరనేది ప్రశ్న కాదు. మెజారిటీ ఎంతనేది ప్రశ్న. సెంటిమెంట్ పనిచేసిందనీ చెప్పలేం. ఎందుకంటే టీడీపీ అభ్యర్థి భూమా వారసుడు కాదు. సెంటిమెంట్ ఉండే అవకాశమే లేదు. డబ్బుల ప్రభావం.. తొలి దశలో మంత్రి నారాయణ నంద్యాలలో ప్రతి వార్డూ తిరిగి చేసిన వాకబులు పనిచేసి ఉండవచ్చు. ఇప్పటికి మనల్ని పట్టించుకునే వారొచ్చారే అనే భావం ఎంతకైనా వెడుతుంది. అదే టీడీపీ విజయానికి కారణమైంది. ఓట్ల లెక్కింపునకు ముందు రోజు టీడీపీ నాయకులు భేటీ అయినప్పుడు… మన పార్టీకి ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయనున్నంత వరకూ మనకు తిరుగులేదని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జోకులు వేసుకున్నారట. సో.. జగన్మోహన్ రెడ్డి గారు.. ఇప్పటికైనా మాటల యుద్ధాన్ని పక్కన పెట్టి, 2019 ఎన్నికలకోసం వ్యూహాత్మకంగా అడుగులేస్తే మేలేమో. ఎంత కాదనుకున్నా.. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ మనిషి. అంటే జగన్కు హాని ఎక్కడ జరిగిందో చెప్పాల్సిన అవసరముందా? ఈ గెలుపుతో మరో విషయం కూడా స్పష్టమైపోయింది. టీడీపీని వదిలే ధైర్యం బీజేపీ చేయదనేదే అ అంశం. వ్యూహకర్తలు ఎప్పుడూ వెనకుండాలి. ఈయనే మన వ్యూహకర్తంటూ కార్యకర్తలకు జగన్ పికెని పరిచయం చేసి, పప్పులో కాలేశారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా!
-సుమ