”నేను తలచుకుంటే గంటలో ప్రభుత్వం కూలిపోతుంది” ఇవీ జగన్ చెప్పిన మాటలు. గవర్నరు నరసింహన్‌ను కలిసి తుని- తదనంతర ఘటనల మీద ఫిర్యాదులు చేసి.. మరికొన్ని ఇతర డిమాండ్లు అయన సముఖానికి సమర్పించి వచ్చారు. కానీ ఆయనకు వెలుపలికి వచ్చిన తర్వాత.. మీడియాతో మాట్లాడుతుండగా.. అందరి ప్రశ్నలు మాత్రం ఫిరాయింపుల మీదికే ఫోకస్ అయ్యాయి. ‘మీ పార్టీనుంచి తెదేపాలోకి వెళ్లిపోతున్నారటకదా’ అని మీడియా అడిగితే.. ‘తెదేపాలోంచే మాలోకి వచ్చేస్తున్నారంటూ’ జగన్ చాలా ఆర్భాటంగా చెప్పారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలా మంది నాతో టచ్‌లోనే ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేయడానికి మాకు 21 మంది తెదేపా ఎమ్మెల్యేలు కావాలి. ఆ సంఖ్య రాగానే.. మీ అందరినీ పిలిచి ఆ విషయం వెల్లడిస్తా. నేను తలచుకుంటే గంటలో ప్రభుత్వం కూలిపోతుంది అని కూడా వైఎస్ జగన్మోహనరెడ్డి చిరునవ్వులు చిందిస్తూ ప్రకటించారు. అయితే ఈ మాటల్లో నిజమెంత? ఆర్భాటమెంత? తనలో ఉన్న భయాన్ని దాచుకోవడానికి బలవంతంగా ప్రదర్శిస్తున్న డాంబికమెంత? ఇవన్నీ ప్రశ్నలే. కాగా… ‘నేను తలచుకుంటే గంటలో ప్రభుత్వాన్ని కూల్చేస్తా’ అనే వైఎస్ జగన్మోహనరెడ్డి ముక్తాయింపు మాటలు మాత్రం ఉత్తర కుమార ప్రగల్భాలుగానే కనిపిస్తున్నాయి. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా జగన్ ఇదే తరహా ప్రకటనలకు అలవాటు పడ్డారు. నా దయ మీదనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి.. నేను తలచుకుంటే.. గంట సమయం చాలు ఈ ప్రభుత్వాల్ని కూల్చేస్తా అని.. అన్న సందర్భాలు ఉన్నాయి. జగన్ బలం ఇంత ఉన్నదేమో అని జనం కొన్నాళ్లు నమ్మారు.. ఆ తర్వాత ఇదంతా వాగాడంబరమే తప్ప.. అసలైన బలం కాదని నవ్వుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా, ఆ ప్రభుత్వాల హయాంలోనే పాచిపోయిన ‘తలచుకుంటే గంటలో కూల్చేస్తా’ ప్రకటనల్ని జగన్ మళ్లీ సంధించడం ఎందుకు? సాధారణ రాజకీయ లాజిక్ ప్రకారం.. అధికారంలో ఉన్న పార్టీలోకి వలసలు వెళ్లడానికి అవకాశవాద రాజకీయ నాయకులు ప్రయత్నిస్తూ ఉంటారని మనకు తెలుసు. ఇక్కడ తెలంగాణలో తెరాసలోకి ఎమ్మెల్యేలు వెల్లువెత్తినా.. అక్కడ తెదేపా వైపు వైకాపా వారు వలపు చూపులు చూస్తూ ఉన్నా అవన్నీ కూడా.. తమ తమ స్వప్రయోజనాలకోసమే తప్ప.. మరొకటి కాదని అందరికీ క్లారిటీ ఉంది. అయితే ఎన్నికలు ఇంకా మూడున్నరేళ్ల దూరంలో ఉండగా.. అధికార పార్టీని వదులుకుని, ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసేసి.. జగన్ పార్టీలో చేరడానికి తెదేపా ఎమ్మెల్యేలు ఎందుకు ఉత్సాహ పడతారనేది లాజిక్కు అందని సంగతి. ఆయన అభివర్ణిస్తున్నట్లుగా జగన్ అంటే ప్రేమాభిమానులు, ఆయనతో ఎక్కు సాన్నిహిత్యం ఉన్న ఎమ్మెల్యేలు తెదేపాలో ఉండవచ్చు గాక.. అంత మాత్రాన వారు అధికార పార్టీని వదిలేసి జగన్ పార్టీలోకి రావాలంటే చాలా బలమైన కారణాలు ఉండాలి. అధికార పార్టీ ద్వారా తాము పొందగల సకల ప్రయోజనాలను వదులుకోవాలి. అంతకంటె గొప్ప ఆకర్షణ జగన్ నుంచి వారికి కనిపించాలి. మరి అలాంటి పరిస్థితి ఉన్నదా? తెలుగుదేశం నాయకులంతా వైకాపాలోకి వలస వచ్చేయడం, ప్రభుత్వాన్ని గంటలో కూల్చేయడం అనేది ఆనం విజయకుమార్‌రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకున్నంత ఈజీ కాదు. ఆనం కుటుంబంలో ఉన్న విభేదాల పర్యవసానంగానే.. రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి తెదేపాలో చేరిన ఎఫెక్ట్ విజయకుమార్‌రెడ్డి వైకాపా వైపు వచ్చారే తప్ప.. అది జగన్ మీద ప్రేమతో అనడానికి ఆస్కారం ఉన్నదా? రేపు పొద్దున్న జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి తెదేపాలో చేరగానే, దానికి ప్రతిచర్య లాగా రామసుబ్బారెడ్డి ఇటు రావచ్చు. అంతమాత్రాన దానిని ‘జగన్ నాయకత్వం మీద విశ్వాసం పెల్లుబికినందువల్ల..’ అనగలమా? జగన్ ఒకసారి ఆలోచించుకోవాలి. కొందరు తెదేపా వారు జగన్‌తో టచ్‌లో ఉండవచ్చు గాక. రాజకీయాల్లో ఇదేమీ అనూహ్యమైన విషయం కాదు. కానీ దాని గురించి జగన్ జనాన్ని ఊరిస్తున్నట్లుగా.. గంటలో కూల్చేస్తా లాంటి ప్రగల్భాలు పలకడం దండగ. పైగా ఏడాదిలో మళ్లీ నా ప్రభుత్వం వచ్చేస్తుంది.. అని జగన్ ఇప్పటికే చాలా నెలలనుంచి చాటుకుంటూ పరువు నష్టం చేసుకుంటున్నారు. దానికితోడు ఇలాంటివి కూడా జత అయితే.. జనం దృష్టిలో ఆయన పలుచన అవుతారు. అందుకే తెదేపా సర్కారును కూల్చడానికి ప్రణాళికాబద్ధంగా సాగుతూ ఉన్నా సరే.. అంతా ఒక కొలిక్కి వచ్చే వరకు ఆయన గుంభనంగా ఉంటేనే అది ఆయనకు లాభిస్తుంది తప్ప.. ఇలాంటి డాంబికపు ప్రకటనలు మైండ్గేంలా పనిచేసి.. మరింత మందిని తనవైపు ఆకర్షిస్తాయని అనుకుంటే పొరబాటు