ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యించి చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి దానిని మధ్యలోనే ఆపేసినట్లున్నారు. ప్రత్యేక హోదా కోసం ఆయన చేసే పోరాటాలకు మా పార్టీ కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని మేము చెప్పినా ఆయన తనపై ఉన్న సీబీఐ కేసులకు భయపడి ఆశించిన స్థాయిలో ఉద్యమించడం లేదు. తెదేపా ప్రభుత్వాన్ని తన పూర్తి బలంతో డ్డీ కొంటున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు చాలా భయపడుతున్నారు. ఆయన భయపడుతున్న సంగతి రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించారు. మేమే ఆయన స్థానంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి ఉంటే, మా ఉద్యమాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఊపిరి సలపనీయకుండా చేసి పరిగెత్తించేవాళ్ళం,” అని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన తరువాత, మళ్ళీ ప్రత్యేక హోదా పోరాటాలతో ప్రజలను మెప్పించి బలపడాలని ప్రయత్నించి భంగపడింది. అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టారు. అప్పటి నుంచే ఆయన ప్రత్యేక హోదాపై ఉద్యమించడం మోదలుపెట్టారు. కానీ లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా సరయిన ప్రణాళిక లేకుండా దోసుకుపొయి ఆయన కూడా భంగపడ్డారు. వైకాపా ఉద్యమాలతో రాష్ట్రం మళ్ళీ వేడెక్కితే మళ్ళీ సర్దుకోవచ్చని ఆశపడిన కాంగ్రెస్ నిరాశ చెందడం సహజమే. అందుకే రఘువీరా రెడ్డి జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని అంత మాట అనేశారని భావించాల్సి ఉంటుంది.
ప్రధాని నరేంద్ర మోడి అమరావతి పర్యటనకు వచ్చినపుడు తెదేపాతో తమ పార్టీ స్నేహం కొనసాగుతుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని విస్పష్టంగా ప్రకటించారు తప్ప రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూసిన ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజిపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఆ కారణంగా జగన్మోహన్ రెడ్డి తన పోరాటాలను మరింత ఉదృతం చేయడానికి మోడీ చాలా మంచి అవకాశం కల్పించారు కానీ మోడీ మాటల్లో జగన్ ఎటువంటి హెచ్చరికను చూసారో తెలియదు. ఆనాటి నుంచే ప్రత్యేక హోదాపై తన పోరాటాలను నిలిపివేశారు. అదే మాట రఘువీరా రెడ్డి ఇప్పుడు చెప్పారు అంతే.