హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు శుక్రవారంరాత్రి హైదరాబాద్‌లోని ‘టి న్యూస్’ ఛానల్‌కు నోటీసులు ఇవ్వటానికి వ్యతిరేకంగా తెలంగాణ జర్నలిస్టులు ఏపీ సచివాలయం ఎదుట, ఏపీ డీజీపీ కార్యాలయం ఎదుట ఇవాళ నిరసనలు నిర్వహించారు. ఏపీ సీఎమ్, డీజీపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జర్నలిస్టుల నిరసనలతో ఏపీ సచివాలయం, డీజీపీ ఆఫీసువద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. సీఎమ్ చంద్రబాబు, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్లమధ్య జరిగినట్లు చెబుతున్న టెలిఫోన్ సంభాషణలను ప్రసారం చేశారనే ఆరోపణలపై విశాఖ ఏసీపీ రమణ టీన్యూస్ ఛానల్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ సంభాషణల వార్త ఏపీ, తెలంగాణ ప్రజలలో సామరస్యాన్ని దెబ్బతీసేటట్లుగా ఉందని, రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు, రాజకీయ పార్టీలమధ్య విద్వేషాలను రగిల్చేవిధంగా ఉన్నాయని, ఏపీ ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా ఉందని ఆ నోటీసులో ఆరోపణ. దీనికి సంబంధించి టీ న్యూస్ ఛానల్‌పై చట్టపరమైన చర్య ఎందుకు తీసుకోగూడదో మూడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో అడిగారు.