నిన్న తునిలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వైకాపా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, “ప్రశాంతంగా మొదలయిన కాపు ఉద్యమాన్ని చెడగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కొన్ని అసాంఘిక శక్తులని సభలో ప్రవేశపెట్టి ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చివేశారు. ఇందుకు ఆయనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. ఎక్కడ ఏమి జరిగినా ఆయనకు జగన్మోహన్ రెడ్డిని నిందించడం అలవాటయిపోయింది. ఎన్నికల సమయంలో కాపుల సంక్షేమం కోసం వెయ్యి కోట్లు ఇస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేవని సాకు చెపుతూ కేవలం వంద కోట్లు కేటాయించడం వారిని మోసం చేయడమే. పుష్కరాలు, పట్టిసీమ, చంద్రన్న కానుక అంటూ వందల కోట్లు వృధా చేసిన చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీని అమలు చేయడానికి మాత్రం డబ్బులులేవని చెపుతున్నారు. కాపులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు అందరూ వారిని మరింత రెచ్చగొట్టే విధంగానే మాట్లాడారు తప్ప ఎవరూ వారిని అనునయించే ప్రయత్నం చేయలేదు. ఆ కారణంగా వారిలో అసంతృప్తి పెరిగి ఈ ఉద్యమానికి దారి తీసింది. దానిని భగ్నం చేసేందుకే చంద్రబాబు నాయుడు అసాంఘిక శక్తులను ప్రవేశపెట్టి హింసాత్మక ఘటనలకు జరిగేందుకు కారకులయ్యారు. కనుక దానికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలి. తునిలో నిన్న జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం,”అని అన్నారు.
వైకాపాలోని మరో సీనియర్ అంబటి రాంబాబు కూడా ఇంచుమించు అదేవిధంగా మట్లాడారు కానీ నిన్న జరిగిన అల్లర్లలో ప్రభుత్వమే అసాంఘిక శక్తులను ప్రవేశపెట్టినట్లు ఆరోపించలేదు. ప్రశాంతమయిన తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా చిచ్చు పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించినందున, అంబటి రాంబాబు అదే కోణంలో జవాబిచ్చారు.
“వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన ఉభయగోదావరి జిల్లాల ప్రజలలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. దానిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే అది ఈవిధంగా బయటపడింది. ఈ ఘటనలకు తమ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, వైఖరే కారణమని గ్రహించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి మాపై ఆరోపణలు చేయడం చాలా విస్మయం కలిగిస్తోంది. కాపు ఉద్యమాన్ని రాజకీయం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు.దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉద్యమంలో ఇటువంటి సంఘటనలు జరగడం మంచిది కాదు కనుక అందరినీ సంయమనం పాటించమని కోరుతున్నాము,” అని అంబటి రాంబాబు అన్నారు.