హైదరాబాద్: ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అని నానుడి. నటుడు మోహన్‌బాబు సిబ్బంది – కొట్టి మాట్లాడతాడనే పేరున్న తమ యజమాని రూటులోనే వెళుతున్నట్లున్నారు. ఫిల్మ్‌నగర్‌లోని నటుడు మోహన్‌బాబు నివాసంవద్ద నిన్న జరిగిన గొడవలో ఆయన మనుషులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి డ్రైవర్‌ను చితకబాదారు. నాగరాజు అనే ఆ డ్రైవర్ మోహన్‌బాబు ఇంటివద్ద రోడ్డుమీద ఎవరికోసమో వేచిచూస్తూ ఉండగా మోహన్‌బాబు ఇంటి గార్డ్లు అతనిని పక్కకు జరగమని అడగటంతో గొడవ మొదలయింది. గొడవవిని బయటకొచ్చిన మోహన్‌బాబు సిబ్బంది – డ్రైవర్ నాగబాబు, మంచులక్ష్మి సహాయకుడు మణికంఠ, మరో డ్రైవర్ కొండలరావు నాగరాజుపై దాడిచేశారు. ఈ దాడికి సంబంధించిన ఫోటోలుకూడా మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నాగరాజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు మోహన్‌బాబు సిబ్బందిని అరెస్ట్ చేశారు. మంత్రి డ్రైవర్ నాగరాజు చేతికి బాగా గాయాలయ్యాయి. బాధితుడు మంత్రి మనిషి అయినందున కేసు బలంగానే ఉండే అవకాశాలున్నాయి. అయినా మోహన్‌బాబు కుటుంబానికి వివాదాలు కొత్తేమీ కాదుగా!