పశ్చిమబెంగాల్లో హవా నడిపిస్తూ రాజ్యమేలుతున్న తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ విషయంలో నరేంద్రమోడీ వైఖరిలో ఇదివరకటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఒకసారి గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి. బెంగాల్లో తమ పప్పులు ఉడకవనే క్లారిటీ ఉన్న మోదీ అక్కడ ప్రచార సభల్లో.. మమతా నాకు సోదరి. ఆమె పాలన బాగుంది అని కితాబులిస్తూ.. నామమాత్రపు ప్రచారం చేశారు. భాజపా కేంద్రంలో గద్దె ఎక్కడానికి మద్దతు అవసరం పడేట్లయితే.. చచ్చినట్టు ఆమెను బతిమాలాల్సి రావచ్చుననే భయంతో అప్పట్లో కీర్తించారు. పూర్తి మెజారిటీతో గద్దె ఎక్కాక.. దీదీ పట్ల అభిప్రాయం మారిపోయింది. అయినా సరే ఆ రాష్ట్రంలో వేళ్లూనుకోగల చేవ మాత్రం భాజపా కు దక్కలేదు.
తీరా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేస్తున్న మోదీ.. దీదీ పట్ల తనలో రగులుతున్న అసలు అక్కసును బయట పెట్టారు. ప్రధానిగా తన ఆధిపత్యాన్ని మమత ఇప్పటిదాకా గుర్తించలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే మోదీ అభ్యర్థిత్వం విషయంలో తూచ్ అనేసిన మమతా బెనర్జీ, ఆయన ప్రధాని అయ్యాక కూడా కేంద్రాన్ని ఖాతారు చేయకుండా తన పాలన సాగిస్తున్నారు. ప్రధాని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులతో నిర్వహించే ఏ సమావేశానికి కూడా ఆమె వెళ్లరు కూడా! మోదీ ఆ కడుపు మంట దాచుకోలేకపోతున్నారు. ఆమెకు అభివృద్ధి అక్కర్లేదు.. సమావేశం నా ఆధ్వర్యంలో జరుగుతుందని, ఆమె హాజరు కావడం లేదు.. అంటూ ఎన్నికల ప్రచారంలో అసలు గుట్టు బయటపెడుతున్నారు.
పైగా మమత తన సమావేశాలకు రారు గానీ, ఢిల్లీ వచ్చినప్పుడు సోనియాగాంధీతో భేటీ అవుతారనేది మోడీకి ఉన్న మరో అభ్యంతరం. అది కూడా ఆమె తప్పిదం కింద ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. అయినా మోడీ ఒకటి గుర్తుంచుకోవాలి. మమత ఆయన నిర్వహించే సమావేశాలకు వస్తుందా లేదా అనేది ఆ రాష్ట్ర ప్రజలకు అనవసరం, అక్కడ ఆమె పాలన బాగున్నదా లేదా అని చూసి మాత్రమే వారు ఓట్లేస్తారు.
అయినా మోడీ గారూ.. తెలుగు ప్రజల తరఫున మాదొక ప్రశ్న. మా చంద్రబాబు తమరు పెట్టే ప్రతిసమావేశానికీ వస్తారు. సమావేశాలు పెట్టకపోయినా పదేపదే ఢిల్లీ వచ్చి మీ దర్శనమూ, మీ సచివుల దర్శనమూ చేసుకుని వస్తుంటారు. అయినా మా ఆంధ్రప్రదేశ్ ఖర్మ ఇలా ఎందుకు కాలుతోంది. మీరు మాకు ముష్టికూడా విదిలించడం లేదు ఎందుకు? ఇలాంటి మీ వైఖరి మమతకు మాత్రం తెలియదు అంటారా? కాబట్టి.. మాటల కనికట్టుతో జనాన్ని మోసం చేసే ఆలోచనలు మీరు మార్చుకుంటే మంచిది!