హైదరాబాద్: రేపు తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగ పేరు మార్మోగిపోతోంది. వాడవాడలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేటు సంస్థలు ఈ కార్యక్రమాలకోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. విద్యాసంస్థలలో అయితే ఇక చెప్పనవసరంలేదు. గత కొద్దిరోజులుగా ఈ కార్యక్రమంకోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయంమేరకు భారత్‌తోసహా 192 దేశాలలోకూడా ఈ యోగా డే జరగబోతోంది. ఈ నిర్ణయంవెనక ప్రధానమంత్రి నరేంద్ర మోడి కృషి, చొరవ ఎంతో ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశంలో ఆయన యోగాకు ఉన్న శక్తిని, ప్రాధాన్యతను నొక్కిచెబుతూ వర్తమాన ప్రపంచానికి దాని అవసరం ఎంతో ఉందని గుర్తుచేశారు. ఆయన వాదనను పరిగణనలోకి తీసుకున్న ఐరాస జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.
ఐరాస నిర్ణయాన్ని, దానివెనక తమ ప్రభుత్వ కృషిని తెలియజెప్పడంకోసం ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని మోడి నిర్ణయించారు. కొద్ది ప్రాంతాలు తప్పితే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. ప్రపంచ రికార్డులను తిరగరాసేటట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఒక్క ఢిల్లీలోనే రాజ్‌పథ్‌లోనూ, ఇండియాగేట్ పరిసరాలలోనూ 37వేలమంది పాల్గొనబోతున్నారు. ఇక అంతర్జాతీయ సముద్రజలాలలో ఉన్న యుద్ధనౌకలమీద, సియాచిన్ పర్వత పాదాల చెంతనా సైనికులు ఆసనాలు వేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 191 దేశాలలోనూ భారత దౌత్యకార్యాలయాలు ఆయా చోట్ల ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించబోతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో 30వేలమందితో జరిగే కార్యక్రమానికి సుష్మా స్వరాజ్ హాజరవుతున్నారు. కొన్ని వర్గాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రేపు వేసే ఆసనాలనుంచి సూర్యనమస్కారాలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.