రాజకీయ పార్టీలకు పత్రికల అండ అనేది చాలా సాధారణ విషయమైపోయింది. ఆంధ్రా విపక్ష పార్టీ వైకాపాకి సొంతంగా సాక్షి పత్రిక ఉంది. జగన్ కార్యకలాపాలతోపాటు, అవకాశం ఉన్న ప్రతీ సందర్భంలోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా కథనాలు వేస్తుంటారనేది అందరికీ తెలిసిందే. సొంత వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేదే ఆ పత్రిక ప్రధానోద్దేశం. దీంతోపాటు ‘విలువలతో కూడిన పాత్రికేయం తమదే’ అని చెప్పుకుంటూ ఉంటారు! వైకాపా గొంతును ప్రజలకు వినిపించడం వరకూ ఆ పత్రిక పాత్ర బాగానే ఉంది. ఇదే సందర్భంలో పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా వారికి ఉంది కదా. వాస్తవాలను ప్రజలకు చేరెయ్యాల్సిన కర్తవ్యం అనేది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు, నంద్యాల ఎన్నికల ఫలితంపై వారు ఇచ్చిన విశ్లేషణలు చూస్తే… వాస్తవాల మాట అటుంచి, ఒక పత్రికగా పార్టీకి చేస్తున్న దిశా నిర్దేశం ఇదా అనే ఆశ్చర్యం కలుగుతుంది!
ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు శిరోధార్యం. దాన్ని గౌరవించాల్సిందే. కానీ, నంద్యాల ఫలితంపై ఆ మీడియాలో వచ్చిన కథనాలను ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే… టీడీపీది గెలుపే కాదు అన్నట్టుగా ఉంది. ఓటమిని ఒప్పుకోకపోవడం అనేది వైకాపాకి సంబంధించి వ్యవహారం. కానీ, ఒక పత్రికగా… విలువలతో కూడిన పాత్రికేయాన్నే చేస్తున్న మీడియా సంస్థగా వాస్తవాలను ప్రతిబింబించాలి కదా, ప్రజాతీర్పును అందరికీ చెప్పాలి కదా! ఈరోజు ఆ మీడియాలో వచ్చిన కథనాల శీర్షికల్ని చూస్తే… వైకాపా ఓటమికి కుంటిసాకులు వెతికే పని సాక్షి చేసిందన్నట్టుగా ఉంది. ‘ప్రలోభపెట్టి గెలిచారు’, ‘అభివృద్ధి చూసి ఓటేశారనుకోవడం దివాలాకోరుతనం’, ‘అది అప్రజాస్వామిక గెలుపు’, ‘అధికార బలంతోనే నంద్యాల విజయం’, ‘నంద్యాలలో టీడీపీది గెలుపు కాదు’, ‘బెదిరించి.. ప్రలోభపెట్టి’.. ఇలాంటి శీర్షికలతోనే నింపేశారు. ఈ కథనాల్లో వైకాపా నేతల వ్యాఖ్యల్నే శీర్షికలుగా తీసుకున్నారనే అనుకుందాం! కానీ, ప్రజలు ఇచ్చిన తీర్పుపై గౌరవం ఏదీ..? ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే చెల్లుబాటు అవుతుందనే ఒక సాధారణ విషయాన్ని అంగీకరించలేనంత పంతం ఒక పత్రికకు ఉండటమేంటీ..?
నిజానికి, నంద్యాలలో ప్రచార పర్వం మొదలైన దగ్గర నుంచే ఆ మీడియా భావోద్వేగ ప్రేరిత కథనాలకే పెద్ద పీట వేస్తూ వచ్చింది. ‘2019 కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాలే నాంది’ అంటూ ఈ నెల 4న పాతక శీర్షిక వేశారు. ఒక ఉప ఎన్నికను ఈ స్థాయి ప్రతిష్ఠాత్మకంగా మార్చుకోవడం ఎంతవరకూ సరైన వ్యూహం అవుతుందని ఓ పత్రికగా ఆనాడే ప్రశ్నించి ఉండొచ్చు. ఆ స్థాయి పట్టుదలకు పోవద్దని సున్నితంగా విశ్లేషించి ఉండొచ్చు. పార్టీ వర్గాలను అప్రమత్తం చేసి ఉండొచ్చు. కానీ, అదే భావజాలాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలపై రుద్దేశారు. ఫలితం.. ఇవాళ్ల అభాసుపాలయ్యారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం లేనిపోని కుంటిసాకులు వెతుక్కుంటూ, వాటికి సరిపడే వ్యాఖ్యలను నాయకుల ప్రసంగాల్లో దూర్భణి వేసి దొరకబట్టి, కథనాలు వండివార్చేసి, ఇవాళ్ల ప్రజల ముందుంచారు.
సరే, ఆ మీడియా కథనాలను సామాన్యులు ఎంతవరకూ నమ్ముతారనేది వేరే చర్చ. వైకాపా క్యాడర్ మొత్తానికి ఆ పత్రికలో కథనాలే మార్గదర్శకాలు కదా! వారిని ఆలోచింపజేయాల్సిన బాధ్యత, సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఆ మీడియా సంస్థకు ఉంటుంది కదా. కానీ ఇప్పుడు, నంద్యాల ఓటమిలో మన తప్పేం లేదన్నట్టూ.. అధికార పార్టీదే తప్పు అంటూ పార్టీ కేడర్ ని ఓదార్చుతున్నట్టుగా ఉంది. ఈ ఫలితంపై వైకాపా వర్గాలు సమగ్రంగా విశ్లేషించుకునే అవకాశం లేకుండా… ఇప్పటికీ, ఎప్పటికీ వారిని ఒక మబ్బులోనే ఉంచే విధంగా ఆ మీడియా కథనాలను గుమ్మరించింది. నిజానికి, నంద్యాల ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుని, లోపాలను గుర్తించగలిగేంత ఆలోచనలు రేకత్తే విధంగా సాక్షి కథనాలు ఉండాలి. ఒక పార్టీ పత్రికగా ఇలాంటి సందర్భాల్లో పోషించాల్సిన పాత్ర అది. కానీ, ఆ బాధ్యత ఎంతవరకూ నిర్వర్తిస్తోందో అనేది వారికే తెలియాలి..!